దంచికొడుతున్న ఎండలు.. ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక..
ABN , Publish Date - Apr 16 , 2026 | 06:57 PM
ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వడదెబ్బలు తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగమండుతున్నాడు. మధ్యాహ్నం బయట తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వడగాల్పుల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక..
ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వడదెబ్బలు తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడగాడ్పులు తీవ్రతరం అవుతున్నాయి. వడదెబ్బల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత ఎక్కువ నీళ్లు తాగండి. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో కష్టమైన పనులు చేయకండి. లైట్ కలర్ దస్తులు ధరించండి. తరచుగా విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. వడదెబ్బ తగిలితే .. వెంటనే ఆ వ్యక్తిని చల్లని ప్రదేశానికి తరలించండి. నేలపై పడుకోబెట్టండి. నీళ్లలో తడిపిన బట్టను కప్పండి. చల్లని నీళ్లు తాగించండి. నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాపదార్థాలను అతడికి తినిపించండి’ అని సూచించింది.
ఈ ప్రాంతాలకు ఐఎమ్‌డీ హెచ్చరిక..
ఏప్రిల్ 20వ తేదీ వరకు తెలంగాణ, రాయలసీమ, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, ఉత్తర కర్ణాటక, మధ్య ప్రదేశ్, విదర్భ, ఒడిశా, జార్ఖండ్, వెస్ట్ రాజస్థాన్‌లలో అత్యంత తీవ్రంగా వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో వేడి, పొడి వాతావరణ పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
టీ-20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు.. యువరాజ్‌కు దక్కిన గిఫ్ట్ ఏంటంటే..
చెల్పూర్ కేటీపీపీ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. భయాందోళనలో స్థానికులు