Share News

దక్షిణ కోస్తా, సీమలో వడగాడ్పులు

ABN , Publish Date - Sep 07 , 2026 | 05:47 AM

ఎల్‌నినో ప్రభావంతో దక్షిణభారతంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా మారాయి. తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. ఇదే సమయంలో అరేబియా సముద్రం నుంచి తేమగాలుల రాక నిలిచిపోయింది. దీంతో పడమర భారతం నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కోస్తాంధ్ర వైపు పొడిగాలులు వీస్తున్నాయి.

దక్షిణ కోస్తా, సీమలో వడగాడ్పులు

  • సాధారణం కంటే ఆరు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు

  • తిరుపతిలో 39.4.. నెల్లూరులో 39.2 డిగ్రీలు నమోదు

  • పలుచోట్ల పిడుగులతో వర్షాలు

విశాఖపట్నం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో దక్షిణభారతంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా మారాయి. తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. ఇదే సమయంలో అరేబియా సముద్రం నుంచి తేమగాలుల రాక నిలిచిపోయింది. దీంతో పడమర భారతం నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కోస్తాంధ్ర వైపు పొడిగాలులు వీస్తున్నాయి. కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రంగా ఉంది. దక్షిణ కోస్తా, దానికి ఆనుకొని రాయలసీమ జిల్లాల్లో ఆదివారం వడగాడ్పులు వీచాయి. వరుసగా రెండో రోజూ దక్షిణ కోస్తాలో అనేక ప్రాంతాలు, కోస్తాలో మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో ఎండ తీవ్రత ఠారెత్తించింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. తిరుపతిలో 39.4, నెల్లూరులో 39.2, కావలిలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత వల్ల ఆదివారం మధ్యాహ్నం తర్వాత పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఎండలు కొనసాగుతాయని, అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఎల్‌నినో సంవత్సరాల్లో వర్షాలు తగ్గడంతో సెప్టెంబరు నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. గతంలో ఎల్‌నినో సంభవించిన 1972, 1997, 2002, 2009 సంవత్సరాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. అటువంటి పరిస్థితి గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో నెలకొనడంతో ప్రజలు ఠారెత్తిపోతున్నారు. మరో ఐదారు రోజుల వరకు ఎండలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం: శంకర్‌

విరగ్గాసిన స్టార్‌ ఫ్రూట్స్‌

Updated Date - Sep 07 , 2026 | 05:48 AM