Share News

ఉత్తర కోస్తాకు తుఫాను ముప్పు

ABN , Publish Date - Oct 23 , 2026 | 04:48 AM

ఉత్తర కోస్తాకు తుఫాను ముంచుకొస్తోంది. గంటకు 55 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉత్తర కోస్తాకు తుఫాను ముప్పు

  • నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

  • ఎల్లుండికి వాయుగుండంగా మార్పు

  • 27 నుంచి భారీ వర్షాలు.. 28న తుఫాను

  • కోనసీమ, కాకినాడ ప్రాంతంలో తీరం దాటుతుందని అంచనా!

విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఉత్తర కోస్తాకు తుఫాను ముంచుకొస్తోంది. గంటకు 55 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను కోనసీమ, కాకినాడ ప్రాంతంలో తీరం దాటుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అండమాన్‌ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం గురువారం ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనున్నది. అది పశ్చిమ వాయవ్యంగా పయనించి 25వ తేదీకల్లా తూర్పు, దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడనున్నది. ఆతర్వాత పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో మరింత బలపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈమేరకు గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో పలు హెచ్చరికలు జారీ చేసింది.

శుక్రవారం నుంచి బంగాళాఖాతంలో గాలుల వేగం పెరగనున్నదని అంచనా వేసింది. వాయుగుండంగా బలపడే సమయానికి తూర్పు మధ్య, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో గాలులు గంటకు 55 నుంచి 65, అప్పుడప్పుడు 75, వాయుగుండంగా మారిన తర్వాత అంటే 26వ తేదీ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో 28వ తేదీ వరకు సముద్రంలో గాలుల ఉధృతి పెరుగుతుందని, అందువల్ల శుక్రవారం నుంచి మత్స్యకారులు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి, 26 నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం (కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, ఉత్తర తమిళనాడు)లోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.


శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు పోర్టులు, ఫిషింగ్‌ ఆపరేటర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కొన్ని మోడళ్ల ప్రకారం వాయుగుండం 28వ తేదీకల్లా తుఫాన్‌గా మారి ఉత్తరకోస్తాలో ముఖ్యంగా గోదావరి డెల్టా (కోనసీమ, కాకినాడ ప్రాంతం)లో తీరం దాటుతుందని విశ్లేషించాయి. 27వ తేదీ నుంచి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి విశాఖ జిల్లా వరకు వర్షాలు ప్రారంభమవుతాయి. 28న శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు వర్షాలు పెరుగుతాయని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు.

తుఫాను ప్రభావంతో శుక్రవారం మన్యం, అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని విపత్తుల ఆ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్‌ సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 04:51 AM