Share News

మధ్య కోస్తా వైపు దూసుకొస్తున్న తుఫాన్‌

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:56 AM

వరుసగా రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయిన కోస్తాంధ్ర వైపు మరో తుఫాను దూసుకువస్తోంది.

మధ్య కోస్తా వైపు దూసుకొస్తున్న తుఫాన్‌
Rain Alert

  • 19 నాటికి అతి తీవ్ర తుఫానుగా ‘అక్వాన్‌’

  • 20న బందరు సమీపాన తీరం దాటే అవకాశం

  • గంటకు 120-145 కి.మీ. వేగంతో గాలులు

  • 19, 20 తేదీల్లో కోస్తా జిల్లాల్లో కుంభవృష్టి

  • మిగిలిన జిల్లాల్లోనూ భారీ వర్షాలు

  • పోర్టుల్లో మూడో నంబరు భద్రతా సూచికలు

విశాఖపట్నం/అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): వరుసగా రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయిన కోస్తాంధ్ర వైపు మరో తుఫాను దూసుకువస్తోంది. గంటకు 120-145 కిలోమీటర్ల వేగంతో వీచే పెనుగాలులతో అక్వాన్‌ తుఫాను బీభత్సం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో కుంభవృష్టి వర్షాలు ముంచెత్తనున్నాయి. నెల వ్యవధిలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ మూడో తుఫాను.. సోమవారం సాయంత్రానికి చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా 600 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇంతవరకు పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, సాయంత్రానికి తుఫానుగా బలపడింది. దీనికి ఇరాన్‌ దేశం సూచించిన ‘అక్వాన్‌’ అని పేరు పెట్టారు. సోమవారం ఉదయం కొంత నెమ్మదిగా పయనించిన తీవ్ర వాయుగుండం సాయంత్రానికి తుఫానుగా మారిన తర్వాత వేగం పెరిగింది. ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారుతుంది. ఆతర్వాత రెండురోజులపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగి 19వ తేదీకల్లా అతి తీవ్ర తుఫానుగా మరింత బలపడుతుంది. ఈ క్రమంలో ఉత్తర వాయవ్యంగా పయనించి 20వ తేదీ ఉదయం తుని, నెల్లూరు మధ్య మచిలీపట్నానికి ఉత్తర దిశగా అతి తీవ్ర తుఫానుగానే తీరం దాటుతుందని చెబుతున్నారు. అతి తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130, అప్పుడప్పుడు 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. ముఖ్యంగా 19, 20 తేదీల్లో కాకినాడ, యానాం, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరించారు. అన్ని పోర్టుల్లో మూడో నంబరు భద్రతా సూచికలు ఎగురవేశారు.


atchannaidu-farmers.jpgభారీ వర్షాలు.. ఎప్పుడు..ఎక్కడ.. ఎంత తీవ్రతతో!

18వ తేదీ నుంచి కోస్తాలో వర్షాలు ప్రారంభమవుతాయి. ఆరోజున శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి.

19న ఉమ్మడి గోదావరి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తుంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అతి భారీగా, శ్రీకాకుళం, మన్యం, అల్లూరిసీతారామరాజు, ఎన్టీఆర్‌, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. 20న ఉమ్మడి గోదావరి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కుంభవృష్టి... శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎన్టీఆర్‌, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న

అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): అక్వాన్‌ తుఫాను నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు, పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. కోసి వరి ధాన్యాన్ని, తీసిన పత్తిని జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ, తుఫాను కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగితే 24గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని, వారం రోజుల్లో రైతువారీగా పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, పడవలను తీరంలో సురక్షింగా నిలపాలని సూచించారు. ఇప్పటికే 30వేల బోట్లు తీరానికి వచ్చాయని, మిగతా 173కూడా తీసుకురావాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. మత్స్యకారులకు లక్షపైగా వాయిస్‌ హెచ్చరికలు పంపామని తెలిపారు. కాగా ఆక్వా రైతుల పేరుతో జగన్‌ కపట ప్రేమ ఒలకబోస్తూ, తన పత్రికలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు.


  • సమీకృత విపత్తు నిఘా వ్యవస్థ ఏర్పాటు

అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి విపత్తులపై సంసిద్ధత, ముందస్తు హెచ్చరికలు, ప్రతిస్పందన, నష్టం అంచనా, పునరుద్ధరణ నిర్వహణ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ డిజాస్టర్‌ ఇంటిలిజెన్స్‌ సిస్టమ్‌(సమీకృత విపత్తు నిఘా వ్యవస్థ)ను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ అమలుకు రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి నుంచి రూ.40 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో బహుళ వనరుల విపత్తు సమాచారం, ఏఐ ఆధారిత మద్దతు, మొబైల్‌ అప్లికేషన్లు, డ్యాష్‌బోర్డు, ముందస్తు హెచ్చరికలతో జిల్లాస్థాయిలో అధికార యంత్రాంగాన్ని ఏకీకృతం చేయనున్నారు. ఇందుకోసం జిల్లాకో మేనేజర్‌ను నియమించి, మూడేళ్లపాటు ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్

Updated Date - Nov 17 , 2026 | 02:56 AM