పది రోజుల్లో మరో అల్పపీడనం
ABN , Publish Date - Sep 13 , 2026 | 03:12 AM
బంగాళాఖాతంలో ఈనెల 22న మరో అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది బలపడి వాయుగుండంగా మారుతుందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేశాయి. దక్షిణ చైనా సముద్రం నుంచి వచ్చే తుఫాన్ అవశేషాల ఫలితంగా ఈనెల 20వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం, థాయ్‌లాండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
22న బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం
విశాఖపట్నం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఈనెల 22న మరో అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది బలపడి వాయుగుండంగా మారుతుందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేశాయి. దక్షిణ చైనా సముద్రం నుంచి వచ్చే తుఫాన్ అవశేషాల ఫలితంగా ఈనెల 20వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం, థాయ్‌లాండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ ప్రభావంతో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడి వాయవ్యంగా పయనించే క్రమంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో ప్రవేశించనున్నదని తెలిపింది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి 24 తర్వాత దక్షిణ ఒడిశాలో గోపాల్‌పూర్, పారాదీప్ మధ్య తీరం దాటనున్నదని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. ఇది వాయుగుండంగానే తీరందాటుతుందా? లేక తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందా? అనేది మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని విశ్లేషించాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు వాయుగుండం వస్తే దక్షిణ ఒడిశా, కోస్తాంధ్రలో మంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేశాయి. అలాగే, ఈ నెలాఖరు లేదా అక్టోబరు మొదటి వారంలో బంగాళాఖాతంలో బలమైన వాయుగుండం లేదా తుఫాన్ వస్తుందని ఓ వాతావరణ నిపుణుడు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి