మేకప్ సహజసిద్ధ సౌందర్యం కోసం
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:18 AM
అందం గురించి మనకెవరూ నేర్పించలేదు. అమ్మలు, అమ్మమ్మలను గమనిస్తూ, వాళ్లు శింగారించుకునే విధానాన్ని మనదిగా మార్చుకున్నాం! రసాయనాలకూ, కృత్రిమ రంగులకూ తావు లేని సహజ సౌందర్యమది. ఆ ఆరోగ్యకరమైన అందాన్ని సొంతం చేసుకోవడం సులభమే! అదెలాగో తెలుసుకుందాం!
అందం గురించి మనకెవరూ నేర్పించలేదు. అమ్మలు, అమ్మమ్మలను గమనిస్తూ, వాళ్లు శింగారించుకునే విధానాన్ని మనదిగా మార్చుకున్నాం! రసాయనాలకూ, కృత్రిమ రంగులకూ తావు లేని సహజ సౌందర్యమది. ఆ ఆరోగ్యకరమైన అందాన్ని సొంతం చేసుకోవడం సులభమే! అదెలాగో తెలుసుకుందాం!
గత ఐదేళ్ల కాలంలో అందం తనను తాను సరికొత్తగా నిర్వచించుకుంది. ఫోన్ల నుంచి బిల్‌బోర్డులు, షాపింగ్ స్టోర్ల వరకూ ప్రతి చోటా సౌందర్య ఉత్పత్తుల ప్రచారం మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. గ్లాస్ స్కిన్ వ్యసనంతో 12 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్లు దైనందిన జీవితాల్లో భాగాలైపోతున్నాయి. కానీ ఇంట్లో నిలువుటద్దం ఉన్నా లేకపోయినా చిటికెలో శింగారాన్ని ముగించేసే మన అమ్మలూ, అమ్మమ్మలూ ఎంత ఆకర్షణీయంగా కనిపించేవారో మనమొకసారి గుర్తు చేసుకోవాలి. అంత ఆకర్షణీయంగా కనిపించడానికి వాళ్లెలాంటి సౌందర్య ఉత్పత్తులూ ఉపయోగించే వారు కాదు కదా? ఇంట్లో నూరిన పసుపు, గోరింట, కాటుకలే వాళ్ల ప్రధాన సౌందర్య సాధనాలు. చర్మ సౌందర్యం కోసం సున్నిపిండి, వెంట్రుకలకు శీకాయ, కుంకుడుకాయ, మందారం. ఇక శిరోజాలంకరణ కోసం పూలు ఉండనే ఉండేవి. మరువాలు, దమనాలు, మల్లెలు, విరజాజులూ, సంపెంగలూ... ఇలా చెప్పుకుంటూ పోతే మరులుగొలిపే పరిమళాలకు ఆ రోజుల్లో కొదవే ఉండేది కాదు. నిజానికి సహజసిద్ధ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే సౌందర్య ఉత్పత్తులు మన ఇళ్లలోనే ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం తెలిస్తే చాలు.
బీట్‌రూట్: మిక్సీలో వేసి రసం తీసి, పెదవుల మీద అద్దుకుని పది నిమిషాల పాటు వదిలేసి, కడిగేసుకోవాలి. దీంతో పెదవులు ఎర్రబడతాయి. లిప్‌స్టిక్ వద్దనుకునేవాళ్లకు ఇదొక సహజసిద్ధ ప్రత్యామ్నాయం.
గోరింట: గోళ్లకు నెయిల్ పాలిష్ వద్దనుకుంటే, గోరింట పెట్టి చూడండి. నెయిల్ పాలిష్ మాదిరిగా, గోరింటతో గోళ్లు మెరుపు కోల్పోవు. పైగా ఎర్రగా పండి నలుగురి దృష్టినీ ఆకట్టుకుంటాయి.
పసుపు: ముఖానికి చక్కని మెరుపు కోసం, పాలు, పసుపు రంగరించి పూసుకుని, ఆరిన తర్వాత స్నానం చేయాలి.
కొబ్బరినూనె: ఈ నూనె సహజసిద్ధ మాయిశ్చరైజర్. వెచ్చబరిచి, చర్మానికి మర్దన చేసి, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే, చర్మపు మృదుత్వం, మెరుపు పెరుగుతాయి.
కాటుక: ఐలైనర్‌కు బదులు దీపం నుశిని వాడుకోవచ్చు. దీన్ని తయారుచేసుకోవడం ఎంతో సులభం. కొద్దిగా వాము, దూదితో తయారుచేసిన ఒత్తులు, తాజా నెయ్యి లేదా ఆముదం ఉంటే సరిపోతుంది.
గంధం: చర్మ పరిమళం, మృదుత్వం కోసం గంధం పొడిని వాడుకోవచ్చు.
పరిమళం: మేక్‌పలో పరిమళం కూడా కీలకమే! అయితే అందుకోసం వేలు పోసి ఖరీదైన పర్‌ఫ్యూమ్స్ కొనడానికి బదులుగా ఇంట్లోనే గులాబీ, మల్లె అత్తర్లు తయారుచేసుకోవచ్చు. మల్లెలు, మరువం, దమనాలను తలలో శింగారించి రాత్రంతా వదిలేస్తే, మరుసటి ఉదయానికి మన తలకట్టు ఘుమఘుమలు వెదజల్లుతుంది. మొగలి రేకులను దుస్తుల్లో దాస్తే, కొన్ని రోజుల వరకూ ఆ సువాసనలు మనల్ని ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి.