22 నాటికి వాయుగుండం
ABN , Publish Date - Sep 18 , 2026 | 05:33 AM
బంగాళాఖాతంలో ఈనెల 21 లేదా 22వ తేదీన వాయుగుండం ఏర్పడనుంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఇంకా ఉత్తరప్రదేశ్‌లో వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం ఉత్తర థాయ్‌లాండ్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనుంది.
తుఫానుగా బలపడే చాన్స్.. 21కి స్పష్టత.. ‘అర్నాబ్’గా నామకరణం?
విశాఖపట్నం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఈనెల 21 లేదా 22వ తేదీన వాయుగుండం ఏర్పడనుంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఇంకా ఉత్తరప్రదేశ్‌లో వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం ఉత్తర థాయ్‌లాండ్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో శనివారం సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈనెల 21 లేదా 22వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం ప్రకటించింది. ఈనెల 24వ తేదీ తర్వాత అది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుందని అంచనా వేసింది. కాగా, వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా దిశగా వచ్చే క్రమంలో తుఫాన్‌గా మారుతుందని కొందరు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి ‘అర్నాబ్’ అని పేరు పెట్టనున్నట్టు తెలిపారు. తుఫానుగా మారడంపై ఈనెల 21వ తేదీ తర్వాత కొంత స్పష్టత వస్తుందని ఐరోపా, అమెరికా వాతావరణ విభాగాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో గురువారం ఎండ తీవ్రత పెరిగింది. దేశంలోనే అత్యధికంగా నెల్లూరులో 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఈ వార్తలనూ చదవండి: