రేపు అల్పపీడనం
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:09 AM
గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారానికి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది.
25న వాయుగుండంగా, 27కు తుఫానుగా బలోపేతం
28, 29 తేదీల్లో ఉత్తర కోస్తా, ఒడిశా మధ్య తీరంపైకి?
ఉత్తర కోస్తాకు భారీ నుంచి అతిభారీ వర్షాలు
బలమైన తుఫాన్లు ఏర్పడేందుకు అనుకూలంగా వాతావరణం
విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారానికి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. అది పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో శనివారం నాటికి వాయుగుండంగా ఈనెల 27వ తేదీనాటికి తుఫాన్‌గా బలపడనుంది. అనంతరం మరింత బలపడి 28వ తేదీకల్లా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుందని పలు మోడళ్లు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో మాడెన్ జూలియన్ ఆసిలేషన్(ఎంజేవో) అనుకూలంగా ఉండడంతో బలమైన తేమగాలులు బంగాళాఖాతం, అరేబియా సముద్రంపైకి వీస్తున్నందున బలమైన తుఫాన్లు ఏర్పడనున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాగా, వాయుగుండం ఈనెల 26వ తేదీ నాటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి తుఫాన్‌గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు వివరించారు.
ఇప్పటివరకు ఉన్న వాతావరణ పరిస్థితుల మేరకు తుఫాన్ ఈనెల 28వ తేదీన ఉత్తరకోస్తాలో తీరం దాటుతుందని, తీరానికి దగ్గరగా వచ్చిన కొద్దీ మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు పెరుగుతాయని, 28వ తేదీన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. అయితే, మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఉత్తర కోస్తాలో తుఫాన్ తీరం దాటనుందని ఐరోపా వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తీరం దాటిన తర్వాత వేగం మందగించనున్నందున ఉత్తరకోస్తాలో ముఖ్యంగా కాకినాడ, అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు వర్షాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.
ఇదిలాఉండగా తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదేప్రాంతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దాంతో తమిళనాడు, దానికి ఆనుకుని రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. వచ్చే వారం కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని, ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని సూచించింది.
ఈ వార్తలనూ చదవండి