అలర్ట్.. మరో మూడు గంటల్లో పిడుగులతో భారీ వర్షాలు..
ABN , Publish Date - Mar 29 , 2026 | 08:37 PM
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.
సోమ, మంగళ వారాల్లో భారీ వర్షాలు..
మరోవైపు రాయలసీమ, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. దాని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో ఈ రెండ్రోజులపాటు ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గనుందన్నారు. అలాగే సోమవారం నాడు విజయనగరం జిల్లా బాడంగి, మెరకముడిదాం, తెర్లాం, వంగర మండలాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, జియమ్మవలస, సీతానగరం మండలాల్లోనూ వానలు పడనున్నాయని వెల్లడించారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల కింద, పొలాలు, బహిరంగ ప్రాంతాల్లో ఉండరాదని హెచ్చరించారు. పోలవరం జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. మంగళవారం నాడు మెుత్తం 12 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
నేటి ఉష్ణోగ్రతలు ఇలా..
ఆదివారం నాడు మార్కాపురం జిల్లాలో మెుత్తం 13 ప్రాంతాల్లో, కడపలో 12, తిరుపతి 11, నెల్లూరు 11, చిత్తూరులో 8 ప్రాంతాలు సహా మిగతా చోట్ల కలిపి మొత్తం 78 చోట్ల 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయని ప్రఖర్ జైన్ తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరులో 42.4°C, మార్కాపురం జిల్లా నందనమారెళ్ల 42.3°C, కృష్ణా జిల్లా పెద్దపారుపూడి 42.1°C, కడప జిల్లా పొట్టిపాడు 41.9°C, తిరుపతి జిల్లా నాగలాపురం, చిత్తూరు జిల్లా సింధురాజపురం 41.7°C, విజయనగరం జిల్లా రాజాం 41.2°C, పల్నాడు జిల్లా నూజెండ్ల, ప్రకాశం జిల్లా కొండపి, నంద్యాల(అర్బన్) 40.8°C, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల 40.4°C, కర్నూలు జిల్లాలో 40.2°C, శ్రీకాకుళం జిల్లా కొల్లువలసలో 40.1°C చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆత్మహత్యాయత్నం చేసిన డాక్టర్ కుటుంబం.. అసలేం జరిగిందంటే..
సీసీటీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..