ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఏపీ వాతావరణ శాఖ అలర్ట్
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:42 PM
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందన్నారు.
అలాగే పోలవరం ప్రాంతంతో పాటు పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇతర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించింది. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు వంటి వాటి కింద నిలబడకూడదని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. అలాగే తాజా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
Also Read:
విషాదం.. హాస్టల్ బాత్‌రూంలో యువతి ప్రసవం.. నవజాత శిశువు మృతి
విజయనగరంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 300 కుటుంబాలు