Share News

ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు అలర్ట్..

ABN , Publish Date - Jun 08 , 2026 | 03:38 PM

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని పేర్కొన్నారు.

ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు అలర్ట్..
Rain Alert

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ విస్తరించాయన్నారు. ఈ మేరకు వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు. మరోవైపు షియర్ జోన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.


ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో నేడు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా పల్నాడు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, అనంతపురం, కడప, సత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.


ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల దృష్ట్యా రైతులు, రైతు కూలీలు, పశువుల కాపరులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక, వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. మరోవైపు ఏపీలో రానున్న రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణ అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: టీజీ భరత్

ఏపీలో వికాస పాలన.. అన్ని హామీలను నెరవేరుస్తున్నాం: మంత్రి బీసీ జానార్దన్ రెడ్డి

Updated Date - Jun 08 , 2026 | 04:43 PM