Share News

Vantalu: జీర్ణశక్తిని కాపాడే మంచి ఔషధం పనసపొట్టు...

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:34 PM

పనసపొట్టును పసుపు, ఇంగువ, ధనియాలపొడి వేసిన నీళ్లలో ఉడికించి నీరు పిండిన తరువాత ముక్కల్ని చిన్నగా తరిగి, మిరియాలపొడి, జీలకర్ర, నెయ్యి వేసి దోరగా వేయిస్తారు.

Vantalu: జీర్ణశక్తిని కాపాడే మంచి ఔషధం పనసపొట్టు...

- వంటల్లో పనస పొట్టు..

పనస, పణ్ణాస అని సంస్కృతంలో పిలిచే పనసని హిందీవాళ్లు కటాహల్‌, చెక్కీ అంటారు. మనం పనస అనే పేరునే వాడుతున్నాం! పండు పనస, కూర పనస అని రెండు రకాలుగా పండుతుంది. కూర పనసకాయను తోలు వలిచి, లోపల కాయని సన్నని ముక్కలు కొట్టి కూర వండుకుంటారు. దీన్నే పనసపొట్టు అంటారు. వాతం, కఫం, వేడి, మధుమేహం, స్థూలకాయం వంటి వ్యాధుల్ని తగ్గించి, జీర్ణశక్తిని కాపాడే మంచి ఔషధం పనసపొట్టు.

వేపుడు: పనసపొట్టును పసుపు, ఇంగువ, ధనియాలపొడి వేసిన నీళ్లలో ఉడికించి నీరు పిండిన తరువాత ముక్కల్ని చిన్నగా తరిగి, మిరియాలపొడి, జీలకర్ర, నెయ్యి వేసి దోరగా వేయిస్తారు. చివరగా పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమపువ్వు, నిమ్మముక్కలు, మొగలి రేకులు వంటి పరిమళద్రవ్యాలను స్వల్పంగా కలిపి, తెల్లని వస్త్రంలో మూటగట్టి కాగుతున్న నేతిలో ఉంచుతారు. ఇది నలుడు పాక దర్పణంలో చెప్పిన రాజభోజనంలో ముఖ్యమైన వంటకం. పోషకాల పుట్ట. రక్తపోటు, మధుమేహం, రక్తహీనతలను తగ్గిస్తుంది. వాత వ్యాధులతో బాధపడేవారికి మంచిది.


book8.2.jpg

పులుసుకూర: పైన చెప్పినట్టు నీళ్లలో ఉడికించి వార్చిన పనసపొట్టుని చింతపండు రసంలో కలిపి, బెల్లం ఉప్పు తగినంత వేసి పులుసుకూర చేస్తారు. కూరని పొయ్యి మీంచి దించాక పావుచెంచాడు ఆవపిండి కలిపి మూత పెట్టి ఒక గంట కదల్చకుండా ఉంచితే ఆవఘాటు కూరకు బాగా పట్టుకుంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. రుచినిస్తుంది. అన్నహితవు కలిగిస్తుంది. తేలికగా అరుగుతుంది. జీర్ణాశయానికి శక్తినిస్తుంది.


ఇగురుకూర: చిక్కుడు గింజలను పనసపొట్టుతో కలిపి ఉడికించాలి. ఆనక నూనెలో తాలింపు వేసి, ఉడికించిన మిశ్రమం కలిపి మూతబెట్టి మగ్గనివ్వాలి. రుచికోసం ఇష్టం కొద్దీ ఇందులో కొబ్బరి తురుము, పాలు, పిండివడియాలు, నువ్వులు, మిరియాలు, ఆవాలు కలిపి ఉడికిస్తారు. చివరగా పరిమళద్రవ్యాలు వేసి భద్రపరుస్తారు. చింతపండు లేనిది కాబట్టి దీన్ని తియ్యగూర అని కూడా పిలుస్తారు. గుండె జబ్బులు, బీపీ, షుగరు ఉన్నవారికి మేలు చేస్తుంది. ఇది అన్ని వ్యాధుల్లోనూ తినదగినది, మంచి ప్రొటీన్‌ ఆహారం. చలవనిస్తుంది.


పాయసం: ఉడికించిన పనసపొట్టులో మిరియాలు, ఏలకులు, నెయ్యి వేసి వేగించి, కాచిన పాలు, కొబ్బరి తురుము, పంచదార, పచ్చకర్పూరం, జీడిపప్పు కలిపి మళ్లీ ఉడికిస్తారు. ఇది శరీరానికి చలవనిస్తూ పోషక విలువలను అందిస్తుంది. పురుషుల్లో జీవకణాలను పెంచుతుంది. బీపీ, మూత్రవ్యాధులున్నవారికి మేలు చేస్తుంది. షుగరు ఉన్నవారు పంచదార లేకుండా తీసుకోవచ్చు.

విటమిన్లు, ఖనిజాలు, పీచు సమృద్ధి కలిగిన ఆహార ద్రవ్యం పనస పొట్టు. ముఖ్యంగా క్యాల్షియం, ఇనుము, పొటాషియం వంటి మూలకాల వలన ఎముక పుష్టికి, స్త్రీల ఆరోగ్యానికి, శరీర సమగ్ర పోషణకు ఉపయోగిస్తుంది. పనస గింజలు కూడా పోషకవంతమైనవే. పొట్టు కొట్టేప్పుడు లేతగింజలు కూడా పొట్టుగా మారిపోతాయి. అందుకని పండు కన్నా ఎక్కువ పీచు, ఎక్కువ పోషకాలు పనసపొట్టు నిండా ఉంటాయి. దీనితో కలిపి వండుకోవటానికి చిక్కుడు, బీన్స్‌, దోస, మామిడి లాంటివి అనుకూలంగా ఉంటాయి.

అందరూ తినదగిన గొప్ప వంటకం. ఇటీవలికాలంలో దీని వాడకం బాగా తగ్గిపోయింది. కొనట్లేదు కాబట్టి అమ్మట్లేదు, అమ్మట్లేదు కాబట్టి కొనటం లేదు... అన్నట్టుగా ఉంది పరిస్థితి.

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


బ్రెడ్‌ మసాలా

book8.3.jpgకావలసిన పదార్థాలు: బ్రెడ్‌ ముక్కలు - ఐదు, బటర్‌ - రెండు టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, మిర్చి - ఒకటి, ఉల్లికాడలు - రెండు, ఉల్లి, క్యాబేజీ, క్యారెట్‌, క్యాప్సికమ్‌ ముక్కలు - నాలుగు స్పూన్లు, టమాటా ముక్కలు - రెండు స్పూన్లు, పావ్‌భాజీ మసాలా - స్పూను,ఉప్పు - అర స్పూను, టమాటా సాస్‌ - రెండు స్పూన్లు, కొత్తిమీర తురుము - రెండు స్పూన్లు.

తయారుచేసే విధానం: ఓ బాణలిలో బటర్‌ వేసి వెల్లుల్లి, మిర్చి, ఉల్లికాడల్ని వేయించాలి. రెండు నిమిషాల తరవాత మిగతా కూరగాయ ముక్కలూ, ఉప్పు కలపాలి. కాస్త మగ్గాక పావ్‌భాజీ మసాలా చేర్చి ఉడికించాలి. టమాటా సాస్‌ కూడా వేసి అంతా కలియబెట్టాలి. బ్రెడ్‌ను చిన్న ముక్కలుగా కట్‌చేసి ఈ మిశ్ర మంలో వేసి, రెండు నిమిషాలు అటూ ఇటూ వేయిస్తే బ్రెడ్‌ మసాలా సిద్ధం.


సీతాఫల్‌ రబ్డీ

కావలసిన పదార్థాలు: సీతాఫలం - ఒకటి, పాలు - ఆరు కప్పులు, కేసరి - కొన్ని రేణువులు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - అర కప్పు, నట్స్‌ ముక్కలు - రెండు స్పూన్లు.

తయారుచేసే విధానం: గింజల్ని తొలగించి సీతాఫలం గుజ్జు తయారుచేసుకోవాలి. ఓ మందపాటి బాణలిలో కేసరి రేణువులను కలిపి పాలను మరగించాలి. సన్నని మంటమీద పాలు సగం అయ్యే వరకు మరగించాక అందులో కండెన్స్‌డ్‌ మిల్క్‌ కలపాలి. ఐదు నిమిషాల తరవాత స్టవ్‌ కట్టేయాలి. పూర్తిగా చల్లారాక సీతాఫలం గుజ్జు రబ్డీలో కలిపి పైన నట్స్‌ వేస్తే సరి. అవసరమైతే కాస్త చక్కెర కలుపుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

దారి మళ్లింది 42 కోట్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2026 | 12:34 PM