Youtuber Arrest: మైనర్లతో అసభ్యకర కంటెంట్ ఇంటర్వ్యూలు.. యూట్యూబర్ కంబేటి సత్యమూర్తి అరెస్ట్
ABN , Publish Date - Jan 07 , 2026 | 06:51 PM
పైసల కోసం సమాజాన్ని భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్న యూట్యూర్లకు పోలీసులు అరెస్ట్‌తో హెచ్చరిక జారీచేశారు. మైనర్లతో అసభ్యకర కంటెంట్ ఇంటర్వ్యూలు చేస్తున్న కంబేటి సత్యమూర్తిని కటకటాల వెనక్కి నెట్టారు.
హైదరాబాద్, జనవరి 7: యూట్యూబ్ వేదికగా మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేస్తూ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న యూట్యూబర్ కంబేటి సత్యమూర్తి అలియాస్ సత్యమూర్తి(39)ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చిన్నారులకు అసభ్యకర ప్రశ్నలు వేసి, ఆ వీడియోలు ప్రమోట్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సదరు.. సత్యమూర్తి మైనర్ బాలబాలికలతో అసభ్యకర, అశ్లీల ఇంటర్వ్యూలు చేసి వీడియోలు అప్‌లోడ్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు ఉన్న మైనర్లను ఇంటర్వ్యూ పేరుతో పిలిచి, లైంగికంగా ఆక్షేపణీయమైన, బూతులు కలిగిన ప్రశ్నలు అడిగి వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాడు సత్యమూర్తి అన్నది అతని మీద ఉన్న ప్రధాన ఆరోపణ.
ఈ కంటెంట్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్‌గా పరిగణించి.. సైబర్ క్రైమ్ పోలీసులు వీటిని గుర్తించి క్రైమ్ నంబర్ 1885/2025 కింద కేసు నమోదు చేసి, పోక్సో చట్టం, ఐటీ చట్టం సెక్షన్ల కింద సత్యమూర్తిని అరెస్టు చేశారు.
ప్రాథమిక విచారణలో యూట్యూబర్ కంబేటి సత్యమూర్తి మైనర్ల మనోభావాలను దెబ్బతీసేలా, కావాలనే.. లైంగిక సూచనలు ఉండే కంటెంట్‌ను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. మైనర్ల భద్రతకు భంగం కలిగించే కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.
ఈ అరెస్ట్ ద్వారా పోలీసులు.. యూట్యూబర్లకు, కంటెంట్ క్రియేటర్లకు హెచ్చరిక జారీ చేసినట్లైంది. మైనర్లను ఇలాంటి కంటెంట్‌లో ఉపయోగించడం నైతికంగా, చట్టపరంగా నేరం అని పోలీసులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష
For More AP News And Telugu News