Share News

యాదాద్రి దేవస్థానంలో బంగారం, వెండి డాలర్లు మాయం.. ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్

ABN , Publish Date - Jan 31 , 2026 | 07:13 AM

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బంగారం, వెండి డాలర్ల మాయం వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఆలయ EO చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు వేశారు. అధికారులకు మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

యాదాద్రి దేవస్థానంలో బంగారం, వెండి డాలర్లు మాయం.. ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్
Yadagirigutta Temple News

యాదగిరిగుట్ట, జనవరి 31: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రసాద విక్రయశాల, ప్రచార శాఖలో ఉండాల్సిన బంగారం, వెండి డాలర్లు మాయమవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఆలయ ఈవో భవానీ శంకర్ ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై అంతర్గత విచారణ అనంతరం విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి దేవస్థానం ప్రచార శాఖలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ రామ చంద్రశేఖర్, రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మి విధుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో వారిని తక్షణమే సస్పెండ్ చేశారు.


పర్యవేక్షణ లోపాలపై చర్యలు

అలాగే, ఈ వ్యవహారంలో పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఉన్నతాధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వారికి మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. విధుల్లో అలసత్వం, రికార్డుల నిర్వహణలో లోపాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయా అధికారులను ఆదేశించారు. కాగా, ఆలయ కౌంటర్లలో విక్రయించాల్సిన బంగారం, వెండి డాలర్ల లెక్కల్లో తేడాలు ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. స్టాక్ రిజిస్టర్‌కు, భౌతికంగా ఉన్న డాలర్లకు పొంతన లేకపోవడంతో ఈ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

భక్తుల విశ్వాసానికి భంగం కలిగించకూడదు

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఆలయానికి సంబంధించిన బంగారం, వెండి వంటి విలువైన ఆస్తుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసం అత్యంత ముఖ్యమని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఆలయ నిధులను, వస్తువులను దుర్వినియోగం చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ఈవో స్పష్టం చేశారు.

దర్యాప్తు కొనసాగింపు

మాయమైన బంగారం, వెండి డాలర్లకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ విచారణకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.


ఇవీ చదవండి:

బడ్జెట్ 2026.. కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయా?

మూడో అతిపెద్ద విమాన మార్కెట్‌గా భారత్‌

Updated Date - Jan 31 , 2026 | 12:05 PM