రూ.1,500 కోట్లతో వర్గల్‌లో ‘వింటేజ్ కాఫీ’ ప్లాంట్
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:11 AM
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ (వీసీబీఎల్) ముందుకొచ్చింది
తొలి దశ యూనిట్‌కు మంత్రి శ్రీధర్‌బాబు భూమి పూజ
గజ్వేల్/హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ (వీసీబీఎల్) ముందుకొచ్చింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులోనిపల్లిలో రూ.1,500 కోట్లతో రెండు దశల్లో ‘ఫ్రీజ్ డ్రైడ్ ఇన్‌స్టంట్ కాఫీ’ ప్లాంట్‌ను నిర్మించనుంది. 5,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల తొలి దశలో ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణాసియాలోనే మొట్టమొదటిసారిగా అత్యంత అధునాతన ‘రోటో టెక్నాలజీ’ని ఈ కాఫీ ప్లాంట్‌లో వినియోగిస్తున్నార ని తెలిపారు. కొత్తగా వేయి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. అత్యాధునిక ఫ్రీజ్-డ్రైడ్ కాఫీ తయారీ సాంకేతికతలో స్థానిక యువత, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారని చెప్పారు. 2027 చివరి నాటికి ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 11 వేల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందన్నారు. యూరప్, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా సహా మొత్తం 22 దేశాలకు మేడ్ ఇన్ తెలంగాణ కాఫీ ఉత్పత్తు లు ఎగుమతి అవుతాయన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు. పరిశ్రమల స్థాపనకు అత్యంత అనుకూలమైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని, అన్ని విధాలా సహకరిస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వీసీబీఎల్ సీఎండీ తాటి బాలకృష్ణ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు?
రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్