ఫ్యూచర్‌సిటీకి ఉద్ధండాపూర్ నీళ్లు!
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:42 AM
భారత్ ఫ్యూచర్‌సిటీకి నీటి సమస్య రాకుండా ఉండేలా.. ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’లో భాగమైన ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పంచాయతీరాజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో దీనికి సంబంధించిన నివేదికను సమర్పించారు.
చందన్‌వెల్లి, సీతారాంపూర్ పారిశ్రామికవాడలకూ అక్కడ్నుంచే
పలు రిజర్వాయర్ల నుంచి రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గ్రామాలకు నీటి సరఫరా
సీఎం సమీక్షలో నివేదిక ఇచ్చిన పంచాయతీరాజ్ అధికారులు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): భారత్ ఫ్యూచర్‌సిటీకి నీటి సమస్య రాకుండా ఉండేలా.. ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’లో భాగమైన ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పంచాయతీరాజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో దీనికి సంబంధించిన నివేదికను సమర్పించారు. ఈ ప్రణాళికపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. క్యాబినెట్‌లో చర్చించిన అనంతరం నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్‌సిటీతోపాటు చందన్‌వెల్లి, సీతారాంపూర్ పారిశ్రామికవాడలకు అవసరమైన నీటిని హిమాయత్‌సాగర్ నుంచి తరలించాలని అధికారులు తొలుత ప్రతిపాదించారు. దీనిని సీఎం అంగీకరించలేదని సమాచారం. హిమాయత్‌సాగర్ నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రాంతాలకు తరలించొద్దని, ఆ నీటిని కేవలం హైదరాబాద్ నగర అవసరాలకే వినియోగించాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ ప్రణాళిక తయారైంది. ఉద్ధండాపూర్ నుంచి షాద్‌నగర్, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లోని 1331 గ్రామీణ ఆవాసాలు, 9 యూఎల్‌బీ (అర్బన్ లోక్‌ల్ బాడీ)లకు లాభం చేకూరేలా దీనిని రూపొందించారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగ ర్ జిల్లాల్లోని పలు గ్రామాలు, యూఎల్‌బీలకు కూడా దీని ద్వారా ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 4,574 గ్రామీణ ఆవాసాలు, 36 యూఎల్‌బీలు ఉపరితల జలవనరులతో నీటి అవసరాలు తీర్చుకుంటున్నాయి. వీటిలో 3,666 గ్రామీణ ఆవాసాలు, 34 యూఎల్‌బీలు శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో నిండే ఎల్లూరు రిజర్వాయర్‌పైనే ఆధారపడి ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం.. ఎల్లూరు రిజర్వాయర్‌పై భారం తగ్గిస్తూ అందుబాటులో ఉన్న మిగిలిన రిజర్వాయర్‌ల నుంచి నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది.
నీటి సరఫరా ఇలా..
సమీక్ష సమావేశంలో అధికారులు సమర్పించిన ప్రణాళిక వివరాలు ‘ఆంధ్రజ్యోతి’కి లభించాయి. వాటి ప్రకారం..
ఉద్ధండాపూర్ రిజర్వాయర్: ఇక్కడి నుంచి 3.89 టీఎంసీల నీళ్లు తీసుకోవాలన్నది ప్రతిపాదన. ఆ నీటిని కొందుర్గు దగ్గర ఉన్న ట్రంక్‌లైన్‌కి (38 కి.మీ.లు) పంప్ చేసి, అక్కడి నుంచి రాఘవాపూర్ (135 మిలియన్ లీటర్స్ పర్ డే- ఎంఎల్‌డీ), అంతారం(40 ఎంఎల్‌డీ), కమ్మదానం(48 ఎంఎల్‌డీ), కొడంగల్ (23 ఎంఎల్‌డీ) వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు పంపించాలి. ఇక్కడి నుంచి చందన్‌వెల్లి, సీతారాంపూర్ పారిశ్రామిక వాడల అవసరాలతోపాటు, షాద్‌నగర్, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, నియోజకవర్గాలకు నీళ్లు అందుతాయి.
సింగూరు రిజర్వాయర్: శంకర్‌పల్లి, చేవెళ్ల, మొయినాబాద్, మోకిల, మోమిన్‌పేటలకు ఇది కొత్త జలవనరుగా ఉంటుంది. ఇందుకోసం సింగూరు దగ్గర కొత్త ఇన్‌టేక్ వెల్, పంపింగ్ మెయిన్ (45 కి.మీ), శంకర్‌పల్లి దగ్గర వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, క్లియర్ వాటర్ మెయిన్ (8 కి.మీ)తో పాటు వాటర్ సంప్‌లు ఏర్పాటుచేయాలి. అంచనా వ్యయం రూ.720 కోట్లు.
జయమ్మ (ఎంఎన్‌కేఎల్‌ఐ): దీని నిల్వ సామర్ధ్యం తక్కువ ఉండడంతో ఇక్కడి నుంచి 0.72 టీఎంసీల నీటినే తీసుకోవాలి. మిగిలిన నీటిని సంగంబండ కింద తీసుకోవచ్చన్న ప్రతిపాదన ఉంది. దీని ద్వారా నారాయణపేట నియోజకవర్గంలో 138 ఆవాసాలు, నారాయణపేట యూఎల్‌బీకి నీళ్లు లభిస్తాయి. దీనికోసం కొత్తగా 58 ఎంఎల్‌డీల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ అవసరం.
సంగంబండ: దీని ద్వారా మక్తల్ నియోజకవర్గంలో 70 ఆవాసాలు, మక్తల్ యూఎల్‌బీ, నారాయణపేట నియోజకవర్గంలో 67 ఆవాసాలు, యూఎల్‌బీ కవర్ అవుతాయి. ఇక్కడి నుంచి 1.01 టీఎంసీలను తీసుకోవాలన్నది ప్రతిపాదన. ఇందుకు మన్యంకొండ-పరేవుల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లను వేరు చేసి కొత్తగా 60 ఎంఎల్‌డీల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటుచేయాలి. అంచనా వ్యయం రూ.425 కోట్లు.
వట్టెం రిజర్వాయర్: ఇక్కడి నుంచి జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో 524 గ్రామీణ ఆవాసాలు, 3 యూఎల్‌బీలకు నీటి సరఫరాకు అవకాశం. ఈ రిజర్వాయర్ నుంచి 2.88 టీఎంసీల నీటిని తీసుకోవాలన్నది ప్రతిపాదన. అంచనా వ్యయం రూ.150 కోట్లు. నీటి తరలింపునకు కొత్త ఇన్‌టేక్ వెల్, 3 కి.మీ.ల వాటర్ పంపింగ్ మెయిన్‌లు, పంపింగ్ సిస్టమ్ ఏర్పాటుచేయాలి. జడ్చర్ల (70 ఎంఎల్‌డీ), మల్లెబోయినపల్లి (10 ఎంఎల్‌డీ), రామిరెడ్డిగూడెం (30.5 ఎంఎల్‌డీ), మన్యంకొండ (70 ఎంఎల్‌డీ) వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లకు వాటర్ పంప్ చేయాలి.
కరివెన రిజర్వాయర్: ఇక్కడి నుంచి 1.46 టీఎంసీల నీళ్లు తీసుకోవాలన్నది ప్రతిపాదన. దీనిద్వారా మహబూబ్‌నగర్ (42.44 ఎంఎల్‌డీ), భూత్‌పూర్ (3.61 ఎంఎల్‌డీ), జడ్చర్ల (12.10 ఎంఎల్‌డీ)తో పాటు పరిశ్రమలకు ఉన్న మరో 40 ఎంఎల్‌డీల నీటి డిమాండ్ తీర్చేందుకు అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
ఆ బాలికపై ఏ కేసు నమోదు చేయట్లేదు: ఢిల్లీ పోలీసులు