22ఏ జాబితాను ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Aug 26 , 2026 | 06:32 AM
రాష్ట్ర ప్రభుత్వం అకారణంగా 22-ఏలో చేర్చిన భూములకు సంబంధించి నిషేధిత జాబితాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే వేలమంది బాధితులతో సెప్టెంబరు 7న ఛలో అసెంబ్లీ నిర్వహించి హైదరాబాద్‌ను స్తంభింపజేస్తామని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు హెచ్చరించారు.
లేదంటే 7న అసెంబ్లీని ముట్టడిస్తాం
భూభారతిని భూమేతగా మార్చుకున్నారు
భూముల కేంద్రంగానే రేవంత్ పాలన
పేదల భూములతో పొంగులేటి
రియల్ వ్యాపారం: హరీశ్ రావు
జీడిమెట్ల, కార్వాన్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అకారణంగా 22-ఏలో చేర్చిన భూములకు సంబంధించి నిషేధిత జాబితాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే వేలమంది బాధితులతో సెప్టెంబరు 7న ఛలో అసెంబ్లీ నిర్వహించి హైదరాబాద్‌ను స్తంభింపజేస్తామని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు హెచ్చరించారు. ధరణిని భూతంగా చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ భూభారతిని భూమేతగా మార్చుకుందని ఆరోపించారు. మంగళవారం షాపూర్‌నగర్‌లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధ్యక్షతన నియోజకవర్గంలోని 22-ఏ బాధితుల సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో పాలిటెక్నిక్ విద్యను యంగ్ స్కిల్ యూనివర్సిటీ శక్తిస్కీమ్ కిందకు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జీవోనెంబర్ 97కు వ్యతిరేకంగా మాసాబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలకు హరీశ్ రావు హాజరై ప్రసంగించారు. ‘‘ప్రజలు, రైతుల భూములను 22-ఏలో చేరిస్తే వారు మిమ్మల్ని నిషేధిస్తారు’’ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. 22ఏలో చేర్చిన భూములపై సిటింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి నివాసాలుంటున్న భూములను కూడా ప్రభుత్వం కమీషన్‌ల కోసం 22-ఏ జాబితాలోకి చేర్చి స్ధానిక నాయకులతో కలిసి రియల్ ఎస్టేట్ కమీషన్ వ్యాపారం చేస్తోదని ఆరోపించారు. పేద ప్రజల జీవితాలతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా, 22-ఏ దెబ్బతో హైద్రాబాద్‌లో రియల్‌ఎస్టేట్ కుప్పకూలిందని.. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిందని విమర్శించారు.
బాధితుల కోసం బీఆర్‌ఎ్‌సకు చెందిన జనతాగ్యారేజ్ ఎప్పుడూ తెరిచే ఉంటుందని, వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కాగా జీవో 97 ద్వారా శక్తిస్కీమ్ కిందకు పాలిటెక్నికల్ కళాశాలను తీసుకురావడం ద్వారా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటోందని హరీశ్‌రావు మండిపడ్డారు. యూనివర్సిటీ, కళాశాలలను ప్రైవేట్‌పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వెంటనే ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని హరీ్‌షరావు డిమాండ్ చేశారు. జీవో 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే లక్షమంది విద్యార్థులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి