Share News

11వ తరగతికిబోర్డు పరీక్ష లేదు

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:33 AM

పదో తరగతి పూర్తయితే. మళ్లీ 12వ తరగతిలోనే బోర్డు పరీక్ష. మధ్యలో ఉండే 11వ తరగతి బోర్డు పరీక్షను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

11వ తరగతికిబోర్డు పరీక్ష లేదు
exam

  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీనియర్‌ సెకండరీ విధానం

  • సర్కారీ బడుల్లో టెన్త్‌ తర్వాత 12శాతం డ్రాపౌట్లు

  • ఏటా 40-45వేల మంది ‘ఇంటర్‌’కు దూరం

  • అందుకే పాఠశాల విద్యలో ఇంటర్‌ విలీనం

  • వచ్చే ఏడాది 411 ప్రభుత్వ జూనియర్‌

  • కాలేజీల్లో 9-12 తరగతుల బోధన

  • ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో 9, 10 తరగతులకూ అనుమతి..

  • బడులకు 12వతరగతి వరకూ అఫిలియేషన్‌

  • ఇంటర్‌ విద్య విలీనంపై సర్కారు కసరత్తు

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పూర్తయితే. మళ్లీ 12వ తరగతిలోనే బోర్డు పరీక్ష. మధ్యలో ఉండే 11వ తరగతి బోర్డు పరీక్షను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరుసగా మూడేళ్లు బోర్డు పరీక్షలు రాయాల్సి వస్తుండడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం దాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీనియర్‌ సెకండరీ విద్యా విధానాన్ని అమలు చేయనున్న ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వాటిలో.. 11వ తరగతిని బోర్డు పరీక్ష నుంచి మినహాయించడం కీలకమైనది. కొత్త విధానంలో 10 తర్వాత 11వ తరగతి బోధన ఉన్నప్పటికీ వార్షిక పరీక్షలను బోర్డు పరీక్షలుగా పరిగణించరు. 8, 9వ తరగతి పరీక్షల్లాగానే వాటినీ నిర్వహిస్తారు. కేవలం 12వ తరగతిలోనే బోర్డు పరీక్ష ఉంటుంది. సీనియర్‌ సెకండరీ విద్యా విధానంపై గత ఏడాదిగా కసరత్తు చేస్తున్న విద్యాశాఖ.. వచ్చే విద్యా సంవత్సరం 2027-28 నుంచి సీనియర్‌ సెకండరీ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తేనుంది.


ఇదీ లెక్క..

ఐదోతరగతి పూర్తయిన విద్యార్థుల్లో 99.1 శాతం మంది 6వ తరగతిలో ప్రవేశం తీసుకుంటున్నారు. 8వ తరగతి తర్వాత 98.8 శాతం మంది 9వ తరగతి చదువుతున్నారు.. కానీ 10వ తరగతి తర్వాత ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరే విద్యార్థుల శాతం 88శాతంగా ఉంది. గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10 పూర్తయిన తర్వాత దాదాపు 40-45 వేల మంది విద్యార్థులు తదుపరి చదువులు కొనసాగించట్లేదు. వారిలో 96శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినవారు. 70శాతం మంది బాలికలు. ఇంటర్‌ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడం వెనుక ప్రధాన కారణం.. ఈ డ్రాపౌట్లను అరికట్టడమేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

అధ్యయనంలో తేలిందేంటంటే..

పది తర్వాత మరో విద్యాసంస్థలో ప్రవేశం పొందాల్సి రావడం, పాఠశాలలు అందుబాటులో ఉన్నవిధంగా జూనియర్‌ కాలేజీలు లేకపోవడం పది తర్వాత డ్రాపవుట్లు పెరగడానికి ప్రధాన కారణమని ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్య 10వ తరగతి వరకూ బోధన అందించే జడ్‌పీహెచ్‌ఎ్‌స బడుల్లోనే ఎక్కువగా ఉంది. అదే.. మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో మాత్రం 10 తర్వాత డ్రాపవుట్‌ రేట్‌ చాలా తక్కువగా ఉంటోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లోనూ 10 చదివినవారిలో 99శాతం మంది ఇంటర్‌ పూర్తి చేస్తున్నారు. కానీ.. ప్రభుత్వ ఆద్వర్యంలోని పాఠశాలల్లో డ్రాపవుట్‌ రేట్‌ 12 శాతంగా ఉంది. మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాల్లో తరగతులు 12వరకు ఉన్నాయి. అందులో పది తర్వాత పాఠశాల మారే అవకాశం లేదు. ప్రాథమిక తరగతుల నుంచి ఇంటర్‌ వరకు ఒకే పాఠశాలలో చదవడంతో ప్రతి విద్యార్థికి అందులోని ఉపాధ్యాయులతో అనుబంధం ఉంటోంది.


విద్యార్థుల విద్యా సామర్థ్యం గురించి ఉపాధ్యాయులకు తెలుసు కాబట్టి.. 10తర్వాత తీసుకోవాల్సిన గ్రూపుల గురించి, ఇంటర్‌ తర్వాత ఉన్నత విద్య గురించి వారు కౌన్సెలింగ్‌ అందిస్తున్నారు. ఈ అంశాలన్నీ విద్యార్థులు 12వ తరగతి వరకూ చదువు కొనసాగించడానికి, ఆ తర్వాత కూడా ఉన్నత విద్యవైపు మళ్లేందుకు దోహదపడుతున్నట్టు విద్యా శాఖ అధ్యయనంలో తేలింది. మరోవైపు.. ప్రభుత్వ బడుల్లో 10 పూర్తయ్యాక చదువు మానేసిన బాలికల్లో చాలామందికి వారి తల్లిదండ్రులు వివాహం జరిపిస్తున్నారు. రాష్ట్రంలో 18 సంవత్సరాల్లోపు జరుగుతున్న బాల్య వివాహాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. అదే.. బడి చదువును 12వ తరగతి వరకూ కొనసాగిస్తే.. బాల్య వివాహాలు ఆగుతాయని, బాలికలు కనీసం 12వ తరగతి వరకు చదివేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటోంది.

411 జూనియర్‌ కాలేజీల్లో 9-12 బోధన..

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యావిధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న 430 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను ఎలా ఉపయోగించాలన్న దిశగా అఽధికారులు కసరత్తు పూర్తిచేసినట్టు తెలిసింది. ఈ 430 కాలేజీల్లో 96.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనే ఉన్నాయి. అలాగే 260 కాలేజీలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు కేవలం 1 కి.మీ. దూరంలో ఉండగా, 55 కాలేజీలు 1-5 కి.మీ. దూరంలో ఉన్నాయి. కేవలం 19 కాలేజీలు మాత్రమే 5 కి.మీ. కంటే ఎక్కువగా దూరంలో ఉన్నాయి. 19 కాలేజీలు మినహాయిస్తే.. మిగతా 411 కాలేజీలు ఉన్నత పాఠఃశాలలకు సమీపంలోనే ఉండటంతో.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని 9-12 తరగతులకు ఉపయోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. వాటిలో విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైనచోట అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టనున్నారు.


కాలేజీల్లో 9, 10వ తరగతి అనుమతులు..

ప్రభుత్వ బడుల విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ.. ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీనిపైనా అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు 10వ తరగతి వరకు ఉన్న ఉన్నత పాఠశాలలు 11, 12వ తరగతి వరకు చదువు చెప్పడానికి అవసరమైన అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంటర్‌ బోధన అందిస్తున్న ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు 9, 10వ తరగతులకూ అనుమతి పొందవచ్చు. 9-12 వరకు ఒకేచోట బోధన ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 1500 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు 9-12 వరకు బోధన అందించాల్సి ఉంటుంది. అయితే ఒకేసారి 9, 10 తరగతులు ప్రారంభించవచ్చు లేదా వచ్చే ఏడాది 9వ తరగతి తర్వాతి ఏడాది 10వ తరగతికి కూడా అనుమతి పొందే వెసులుబాటు ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. కొత్త విద్యావిధానానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

ఇవి కూడా చదవండి..

మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు

Updated Date - Nov 13 , 2026 | 02:34 AM