తెలంగాణలో సర్ షురూ
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:49 AM
సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా.. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని తెలంగాణలో గురువారం(జూన్ 25) నుంచి ప్రారంభించనుంది.
రాష్ట్రంలో నేటి నుంచి ఇంటింటి సర్వేకు వెళ్లనున్న బీఎల్‌వోలు
సగటున వెయ్యిమందికి ఒకరు చొప్పున బీఎల్‌వో
ఈ ప్రక్రియలో ప్రత్యక్షంగా పనిచేయనున్న 90వేల మంది
వివరాల కోసం మూడు సార్లు ఇళ్లకు వెళ్లనున్న బీఎల్‌వోలు
రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లకుగాను 2,38,62,322 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి
వారిలో వివరాలు సరిపోలని ఓటర్లు 89,88,175 మంది
ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో నియోజకవర్గం మారిన ఓటర్ల గుర్తింపు
అక్టోబరు 1 నాటికి తుది ఓటరు జాబితా
హైదరాబాద్/సిటీ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా.. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని తెలంగాణలో గురువారం(జూన్ 25) నుంచి ప్రారంభించనుంది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్‌ల పరిధిలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) గురువారం నుంచి ఇంటింటి సర్వేకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయనున్నారు. ఈసీఐ ఇప్పటికే నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సర్ ప్రక్రియను చేపట్టేందుకు దాదాపు 90 వేల మంది ప్రత్యక్షంగా పనిచేయనున్నారు. వారిలో ఇంటింటి సర్వే చేపట్టనున్న బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) 35,985 మంది, క్షేత్రస్థాయిలో బీఎల్‌వో సూపర్ వైజర్లు 3,596 మంది కాగా.. రాజకీయ పార్టీల తరఫున ప్రతినిధులుగా ఉండే బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) 49,018 మంది. వచ్చే నెల 24వ తేదీ నాటికి ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాల నమోదును పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బీఎల్‌వోలు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు వెళ్లి వివరాల నమోదుకు సహాయం చేసి, పూర్తిచేసిన ఫారాలను సేకరిస్తారు. ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా కూడా సమర్పించేందుకు ఈసీఐ అవకాశం కల్పించింది. ఇది ఓట్ల తొలగింపు ప్రక్రియ కాదని, ఓట్ల స్వచ్ఛతను పెంపొందించే ప్రక్షాళన అని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ మహాక్రతువు ఎలా సాగనుంది? నియోజకవర్గాలు మారిన వారి పరిస్థితి ఏంటి? ఓటర్లు ఏం చేయాలి? అంటే..
ఇదీ షెడ్యూలు..
గురువారంనుంచి జూలై 24 వరకూ బీఎల్ వోలు ఇంటింటి సర్వే చేపడతారు. అందులో సేకరించిన వివరాల ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను సిద్ధం చేస్తారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేకున్నా.. తప్పులు దొర్లినా ఓటర్లు క్లెయిమ్ చేసుకోవడానికి, సవరణల కొరకు దరఖాస్తులు సమర్పించేందుకు నెల రోజుల సమయం ఇస్తారు. జూలై 31 నుండి ఆగస్టు 30 వరకూ సవరణలు, అభ్యంతరాల స్వీకరణ చేపడుతూనే... విచారణలు, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 28 నాటికి పూర్తిచేస్తారు. అన్ని ప్రక్రియలూ పూర్తిచేసి తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న ప్రచురించేలా ఈసీఐ మన రాష్ట్రానికి షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దీని ప్రకారం... సర్ ప్రక్రియను చేపట్టేందుకు ఎన్నికల అధికారులు పటిష్ఠ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో జూలై 24 నాటికి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (ఓటర్ల సంఖ్య ఆధారంగా కొత్తగా పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేయడం) పూర్తిచేస్తారు.
ఇంటివద్ద ఎవరూ లేకపోతే?
సర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు) ప్రతి ఇంటికి వెళ్లి.. ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్న వారికి ముందుగా ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారు. ఓటర్లు తమ పేరు, వయసు, కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా వంటి సమాచారాన్ని పరిశీలించి అవసరమైతే సవరణలు సూచించవచ్చు. బీఎల్‌వోలు వెళ్లిన సమయంలో ఇంటి వద్ద ఎవరూ లేకపోతే.. మరో రెండుసార్లు ఆ ఇంటిని సందర్శించి వివరాలను ేసకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరగడానికి ప్రతి బూత్ వద్ద బూత్ స్థాయి సహాయకు(బీఎల్‌ఏ)లను నియమించుకునే హక్కు రాజకీయ పార్టీలకు ఉంది. వారు బీఎల్‌వోలతో కలిసి పనిచేస్తూ అర్హులైన ఓటర్లకు అండగా నిలుస్తారు. సవరణ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పిస్తారు. ఇంటింటి సర్వేలో సేకరించిన సమాచారం, 2002 డేటా లింకింగ్ ఆధారంగా రూపొందించిన తాత్కాలిక ఓటర్ల జాబితాను బహిరంగపరుస్తారు. బీఎల్‌వోలు వచ్చినపుడు అందుబాటులో లేకపోతే ముసాయిదా జాబితాలో సదరు ఓటరు పేరు పక్కన మార్క్ చేస్తారు. ఆ మార్క్ ఉన్నవారు.. ఆగస్టులో ఆన్‌లైన్ ద్వారా లేదా నేరుగా తహసీల్దార్ ఆఫీసులో ఫామ్-8 ఇచ్చి ఓటును భద్రపరుచుకోవచ్చు.
2.38 కోట్ల మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి
ఈసీ సిద్ధం చేసిన ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లకుగాను.. ఈనెల 20నాటికి ఆన్‌లైన్‌లో 2,38,62,322 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తిచేశారు. 99,64,126 మంది ఓటర్ల మ్యాపింగ్ పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలో ఈసీ పేర్కొంది. మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లలో 89,88,175 మందికి వివిధ రకాల ధ్రువీకరణ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లలో వీరి శాతం 37.67గా నమోదైంది. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మ్యాపింగ్ సమయంలో పెద్దసంఖ్యలో ఓటర్ల వివరాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఆధార్ కార్డు వివరాలు సరిపోకపోవడం, పేరు, వయస్సు, లింగం వివరాల్లో వ్యత్యాసాలు, ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల ఓటు నమోదై ఉండటం, చిరునామా వివరాలు సరిపోకపోవడం, కుటుంబ సభ్యుల వివరాల్లో పొంతన లేకపోవడం, మ్యాపింగ్ సమయంలో డేటా మిస్ మ్యాచ్ కావడం వంటి 11రకాల సమస్యలను గుర్తించిన అధికారులు.. అనామలీస్ కేటగిరీలో 89,88,175 మంది ఉన్నట్లు తేల్చారు. అదేవిధంగా గతంలో భర్త పేరుతో ఉండి, ప్రస్తుతం తండ్రి పేరుతో నమోదు కావడం, వ్యక్తిగతంగా తండ్రి పేరు మారిపోవడం, వయస్సులో అసాధారణ వ్యత్యాసాలు, ఎలాంటి పత్రాలూ సమర్పించకపోవడం, ఆధార్ కార్డు ఒక్కటే ఇవ్వడం ఉంటే అలాంటి ఓటర్లను అనామలిస్ జాబితాలో పెట్టారు. వీరికి నోటీసులు జారీచేసి.. తగిన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని కోరతారు. ఇందుకు తగిన గడువు ఇచ్చి..వారు సమర్పించిన రుజువుల ఆధారంగా ఓటరు జాబితాలో వారిపేర్లను ఉంచుతారు.
నియోజకవర్గం మారితే..
2002లో ఒకరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండి, ప్రస్తుతం హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ఐటీ కారిడార్‌లో నివసిస్తూ ఇక్కడే ఓటు కలిగి ఉంటే, సాఫ్ట్‌వేర్ దాన్ని గుర్తిస్తుంది. దీనికోసం ఎన్నికల సంఘం ఎక్కడా ఓటరును ఇబ్బంది పెట్టకుండా ఒక కేంద్రీకృత డిజిటల్ డేటాబేస్‌ను వాడుతోంది. ఓటరు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలో ఫారాన్ని నింపినప్పుడు, సాఫ్ట్‌వేర్ కేవలం ఆ నియోజకవర్గంలోనే వెతకదు. 2002 నాటి రాష్ట్రవ్యాప్త డేటాబేస్‌లో వారి పేరు, తండ్రి/భర్త పేరును రన్ చేసి చూస్తుంది. ఉదాహరణకు 2002నాటి రికార్డుల్లో వరంగల్‌లో ఆ వ్యక్తి పేరు ఉన్నట్లు సాఫ్ట్‌వేర్ గుర్తిస్తే, అది వెంటనే పాత రికార్డును ఇక్కడి మీ కొత్త రికార్డుతో లింక్ చేస్తుంది. దీనివల్ల మీ పాత ఓటు రికార్డు ఇక్కడికి అనుసంధానమవుతుంది.
2002లో ఓటు లేకపోతే?
వలస వెళ్లడం, అప్పట్లో ఓటు నమోదు చేసుకోకపోవడంవల్ల మీ 2002 రికార్డు అస్సలు దొరక్కపోతే.. అప్పుడు పౌరుని ఓటును తొలగించరు. దానికి బదులుగా, వారి ప్రస్తుత నివాస ప్రాంతంలో స్థానికులేనని నిరూపించే ప్రత్యామ్నాయ పత్రాలను(ఆధార్ కార్డ్, కరెంట్ బిల్, పాస్‌పోర్ట్) పరిశీలించి, ప్రస్తుత ఓటును ‘జెన్యూన్’గా ఖరారు చేస్తారు. అదేవిధంగా.. కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారి పేర్లు 2002పాత ఓటరు జాబితాలో ఉండవు. అలాంటి వారి విషయంలో వారి తండ్రి, తల్లికి చెందిన 2002 ఓటర్ ఐడీ రికార్డుతో పిల్లల ఓటును లింక్ చేస్తారు.
ఏ తప్పునకు ఏ ధ్రువీకరణ పత్రం
ఓటరు పేరులో అక్షర దోషం లేదా ఇంటి పేరు మార్పు ఉంటే.. ఆధార్ కార్డు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పదో తరగతి మెమో వంటి వాటిని సమర్పించాలి.
వయసు లేదా జన్మ తేదీల్లో తేడా ఉంటే.. జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, ప్రభుత్వం జారీ చేసిన వయసు ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలి.
తల్లిదండ్రుల పేర్లు లేదా బంధుత్వాల్లో తేడాలుంటే.. కుటుంబ రేషన్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, కుటుంబ సభ్యుల ఓటరు గుర్తింపు కార్డులు, పాఠశాల రికార్డులను సమర్పించాలి.
ఒకే కుటుంబంలో వయసు తేడాలు అసంబద్ధంగా ఉన్నా, కొన్ని చోట్ల తండ్రి కంటే కొడుకు పెద్దవాడిగా, తాత కంటే మనవడు పెద్దవాడిగా లేదంటే... తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య చాలా తక్కువ వయసు తేడా నమోదైనట్లు ఉన్నా... కుటుంబానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి వివరాలను సరి చేసుకోవచ్చు.
ఇవీ పత్రాలు..
1987 జూలై 1కి ముందు భారత దేశంలో జన్మించిన వారు వారి పుట్టిన తేదీ, పుట్టిన స్థలాన్ని నిర్ధారించే పత్రాలను చూపాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబరు 2 మధ్య పుట్టిన వారు వారితోపాటు తండ్రి, తల్లికి చెందిన పుట్టిన తేదీ పత్రాలను అందించాలి. 2004 డిసెంబరు 2 తరువాత పుట్టిన వారు తమ పత్రాలతోపాటు తండ్రి, తల్లి పత్రాలు అందించాల్సి ఉంటుంది. జనన ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్టు, పదోతరగతి సర్టిఫికెట్, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారు గుర్తింపు కార్డులు, భూ కేటాయింపు పత్రాలను ఎన్నికల సంఘం ఆమోదయోగ్య పత్రాలుగా పేర్కొంది.
సవరించడం తప్ప.. తొలగించడం ఉండదు..
మరణించిన వారి పేర్లను, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారి పేర్లను తొలగిస్తామని, ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించడమనేది ఉండదని, ఎక్కడ లోపాలు దొర్లాయో వాటిని సవరించడం ద్వారా జాబితాలో కొనసాగవచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఏ ఒక్కరి ఓటునూ వారికి ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండా జాబితా నుంచి తొలగించే అధికారం ఏ అధికారికీ లేదు. ఒకవేళ సాఫ్ట్‌వేర్ తప్పుగా చూపించినా, దానికి ఓటరు వివరణ తీసుకున్న తర్వాతే నిర్ణయం ఉంటుంది. ఓటరు వివరాల్లో తేడా ఉంటే, బీఎల్‌వోలు స్వయంగా నోటీసు ఇచ్చి వివరాలు అడుగుతారు. అంతకంటే ముందే తెలంగాణ సీఈవో వెబ్ సైట్‌లో ఎవరికివారు తమ ఓటర్ ఐడీ ద్వారా స్టేట్‌సను చెక్ చేసుకోవచ్చు. బీఎల్‌ఓలు సర్వేకు వచ్చినపుడు ఇంటికి తాళం వేసి ఉన్నంత మాత్రాన ఓటును తొలగించరు. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయని వారికి.. మళ్లీ వీటిని అప్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
ప్రజలేం చేయాలి?
సర్ ప్రక్రియ సమయంలో బీఎల్‌వోలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలను నమోదు చేస్తున్నపుడు ప్రతి ఓటరూ తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. పేరు, వయసు, లింగం, బంధుత్వం, చిరునామా వంటి వివరాల్లో తప్పులు ఉంటే ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత క్లెయిమ్‌లు, అభ్యంతరాల ద్వారా సవరణ కోరవచ్చు. ఒకవేళ మీ పేరు స్పెల్లింగ్ తప్పుల వల్ల దొరకకపోతే, కంగారు పడాల్సిన పనిలేదు. మీ ఇంటికి వచ్చే బీఎల్‌వోకు మీ పాత నియోజకవర్గం వివరాలు (తెలిస్తే ఓటర్ ఐడీ నెంబర్) చెప్తే, వారు తమ వద్ద ఉన్న బీఎల్‌వో నెట్ యాప్‌లో గ్లోబల్ సెర్చ్ ద్వారా వెతికి, అక్కడికక్కడే మ్యాన్యువల్‌గా మీ ప్రస్తుత ఓటుకు ట్యాగ్ చేస్తారు. ఓటరుగా నమోదు కావాల్సిన వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.