Share News

తెలంగాణ – జర్మనీ తురింగియా రాష్ట్రం మధ్య కీలక ఎంఓయూ

ABN , Publish Date - Jun 03 , 2026 | 08:33 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా.. తెలంగాణ రాష్ట్రాన్ని, జర్మనీలోని ప్రతిష్టాత్మక తురింగియా రాష్ట్రానికి మధ్య టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్, స్టార్టప్‌ల రంగాల్లో ఒక కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది..

తెలంగాణ – జర్మనీ తురింగియా రాష్ట్రం మధ్య కీలక ఎంఓయూ
Telangana Germany MoU

హైదరాబాద్, జూన్ 03: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా.. తెలంగాణ రాష్ట్రాని, జర్మనీలోని ప్రతిష్టాత్మక తురింగియా (Thuringia) రాష్ట్రానికి మధ్య టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్, స్టార్టప్‌ల రంగాలలో ఒక కీలకమైన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో తురింగియా సీఎం మారియో వోయిట్ (Mario Voigt) నేతృత్వంలోని జర్మన్ ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా సమావేశమై, ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసింది. భారత-జర్మనీ దేశాల మధ్య ఉన్న దౌత్య, ఆర్థిక సంబంధాల్లో తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానం ఉందని తురింగియా సీఎం మారియో వోయిట్ ఈ సందర్భంగా కొనియాడారు.


సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌పై జర్మనీ ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ అనుసరిస్తున్న నూతన అభివృద్ధి నమూనాకు అంతర్జాతీయంగా దక్కిన గుర్తింపుగా దీనిని అభివర్ణించవచ్చు. తెలంగాణ యువత ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతోందని, ఇప్పటికే అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో మన యువత కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు జర్మనీతో కుదిరిన ఈ సరికొత్త ఒప్పందం ద్వారా రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని బలమైన పునాదులు పడనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం తెలంగాణ యువతకు జర్మనీలో విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఒక కీలక మైలురాయి కానుంది.

జర్మనీ మార్కెట్ అవసరాలు, అక్కడి పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా తెలంగాణ యువతకు ఇక్కడే ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా, రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ'కి తురింగియా రాష్ట్రం పూర్తి సాంకేతిక సహకారం అందించనుంది. అలాగే, రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో (ATCs) బోధనా పద్ధతులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చేందుకు జర్మనీ మద్దతు లభించనుంది. దీనికి అదనంగా, హైదరాబాద్‌లో జర్మన్ భాషా శిక్షణను మరింత విస్తరించాలని ఈ సమావేశంలో ప్రతిపాదించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో జర్మన్ భాషా శిక్షణ విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

పెండింగ్‌‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు వేగంగా పూర్తి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

ఏపీలో కొత్త మద్యం సీసాలు.. 150, 200ml అందుబాటులోకి..

Updated Date - Jun 03 , 2026 | 09:52 PM