ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:31 AM
తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిసి ఏర్పాటు చేసిన యూపీసీ వోల్ట్ సంస్థ ఫ్యూచర్ సిటీలో.......
రూ.5 వేల కోట్ల పెట్టుబడులు.. 4 వేల మందికి ఉపాధి
డావోస్‌లో ‘యూపీసీ వోల్ట్’తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం
‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌కు డబ్ల్యూఈఎఫ్ మద్దతు
సీఎం రేవంత్‌రెడ్డితో డబ్ల్యూఈఎఫ్ చీఫ్ జెరెమీ జర్గెన్స్ భేటీ
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కలిసి పని చేస్తామన్న జెరెమీ
623 కోట్ల పెట్టుబడితో స్నైడర్ ఎలక్ట్రిక్ యూనిట్ల విస్తరణ
ఫ్యూచర్ సిటీలో హౌజింగ్ ప్రాజెక్టులపై గోద్రెజ్ ఆసక్తి
సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తికి ముందుకొచ్చిన ఐనాక్స్
ముగిసిన పర్యటన.. అమెరికాకు సీఎం రేవంత్
హైదరాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిసి ఏర్పాటు చేసిన యూపీసీ వోల్ట్ సంస్థ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌ను నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనికి అవసరమైన విద్యుత్తు సరఫరాకు 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. దీని నిర్మాణ దశలోనే 3 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం డావోస్‌లో ‘యూపీసీ వోల్ట్’ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రెన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రెన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్ధిని సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. అధునాతన ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. కాగా, శంషాబాద్, గాగిల్లాపూర్‌లోని తమ యూనిట్లను రూ.623 కోట్ల పెట్టుబడితో విస్తరిస్తున్నట్లు స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా వెల్లడించింది. దీంతో విద్యుత్తు భద్రతకు సంబంధించిన ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంటాక్టర్లు, పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరగనుంది. సదస్సులో సీఎం రేవంత్ ఆ కంపెనీ సీఈవో దీపక్ శర్మతో సమావేశమయ్యారు. విద్యుత్తు రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్తు నిల్వ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునికీకరణ, విద్యుత్తు సామర్థ్యం పెంపు, ఇండస్ట్రియల్ పార్కులు, పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్తు నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. స్నైడర్‌కు తెలంగాణలో 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలున్నాయి. పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు రావడంలో కృషి చేసిన మంత్రి శ్రీధర్‌బాబును ముఖ్యమంత్రి అభినందించారు.
‘రైజింగ్-2047’కు డబ్ల్యూఈఎఫ్ మద్దతు
‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) మద్దతు తెలిపింది. దీనిలోని విభిన్న కోణాలు పరస్పర సహకారానికి అవకాశం కల్పించేలా ఉన్నాయని డబ్ల్యూఈఎఫ్ ఎండీ జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు. విజన్‌లో తాము భాగస్వామ్యాన్ని పంచుకుంటామన్నారు. తెలంగాణ పెవిలియన్‌లో జెరెమీ జర్గెన్స్, సెంటర్ ఫర్ ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (సీ4ఐఆర్) నెట్‌వర్క్ కో-ఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌లతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. విజన్ లక్ష్యాలు, ప్రపంచ ఆర్థిక వేదిక ఫాలో అప్ సదస్సు ప్రతిపాదనపై చర్చించారు. డబ్ల్యూఈఎఫ్ భాగస్వామ్యంతో ఏటా జూలైలో హైదరాబాద్‌లో దీనిని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జనవరిలో దావోస్ సదస్సులో తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగంలో ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విధానాలను ప్రపంచానికి చూపించాలనే ఆలోచనను పంచుకున్నారు. దీనిపై సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని జెరెమీ జర్గెన్స్ తెలిపారు. చైనాలో ఏటా ‘సమ్మర్ దావోస్’ జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా ఆసక్తి ప్రదర్శిస్తోందని చెప్పారు. అలాగే, హైదరాబాద్‌లో జరిగిన బయో ఏషియా-2024 సదస్సులో ప్రారంభించిన సీ4ఐఆర్ పురోగతిపై సమావేశంలో చర్చించారు.
ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ భారత్‌లో ప్రారంభించిన తొలి థీమాటిక్ సెంటర్ ఇదేనని గుర్తు చేశారు. సీ4ఐఆర్ ఆదర్శ మోడల్‌గా గుర్తింపు సాధించిందన్నారు. పరిశ్రమల అభివృద్ధి ప్రణాళికలో ఉత్తమ పద్ధతులపై సీ4ఐఆర్ చేస్తున్న పరిశోధనల సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పంచుకుంటామని జెరెమీ జర్గెన్స్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ క్యూర్, ప్యూర్, రేర్ ఆర్థిక అభివృద్థి వ్యూహంతోపాటు ఫ్యూచర్ సిటీ ఏర్పాటును మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. ఏరోస్పేస్, డిఫెన్స్, బయో-డిజైన్, సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్‌తో మంత్రుల భేటీ
సదస్సులో మంత్రులు శ్రీధర్‌బాబు, శ్రీనివాసరెడ్డి గోద్రేజ్ ఇండస్ట్రీస్ సీఎండీ నాదిర్ గోద్రేజ్‌తో సమావేశమయ్యారు. ఆయిల్ పామ్ సాగులో ఏఐ వినియోగం, హైదరాబాద్‌లో ఉన్న గోద్రేజ్ క్రీమ్‌లైన్ డెయిరీ ప్లాంట్‌ను రూ.150 కోట్ల పెట్టుబడితో విస్తరించే అవకాశాలపై చర్చించారు. ఫ్యూచర్ సిటీలో భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టే అంశంపై మాట్లాడారు. అక్కడ మౌలిక వసతుల కల్పన ప్రభుత్వానికీ, సంస్థకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. హైదరాబాద్ రావాలని ఆహ్వానించారు.
సౌర, పవన విద్యుదుత్పత్తికి ఐనాక్స్ ఆసక్తి
తెలంగాణను కాలుష్యరహితంగా అభివృద్ధి చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి బృందం దావో్‌సలో ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ దేవాంశ్ జైన్‌తో సమావేశమైంది. సోలార్ మాడ్యూల్స్ సహా ఆధునిక, సుస్థిర తయారీ రంగాల్లో సహకార అవకాశాలపై చర్చించింది. ఐనాక్స్ గ్రూప్ తెలంగాణలో సౌర, పవన విద్యుదుత్పత్తిని చేపట్టి, ఆ తర్వాత తయారీ రంగంలోకి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కాలుష్యం లేని విద్యుత్తు (క్లీన్ ఎలక్ర్టిసిటీ), గ్రీన్ హైడ్రోజన్‌ను అందిచాలనే ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తోందని శ్రీధర్‌బాబు తెలిపారు.
ముగిసిన దావోస్ పర్యటన
సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పర్యటనలో ప్రతినిధుల బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్ కార్యక్రమాలపై ఎంఓయూలు కుదుర్చుకుంది. రెండు కీలక సెషన్లలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం, హైదరాబాద్‌లో ఫాలో అప్ సదస్సు నిర్వహించాలనే ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది. ప్రతినిధి బృందం దావోస్ పర్యటన గురువారం సాయంత్రం ముగిసింది. సీఎం రేవంత్ జ్యూరిచ్ నుంచి అమెరికా వెళుతున్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి తిరుగు పయనమయ్యారు.
తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌కు అపూర్వ స్పందన
ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ కృత్రిమ మేధ మిషన్(అయికామ్)’ను లాంఛనంగా ప్రారంభించింది. ఈ మిషన్‌లో భాగంగానే రాష్ట్రంలో ‘తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్(టీఏఐహెచ్)’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఏఐ ఇన్నోవేషన్ హబ్‌కు దావో్‌సలో అపూర్వ స్పందన లభించింది. పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో రాష్ట్ర బృందం అవగాహన ఒప్పందాల(ఎంఓయూ)ను కుదుర్చుకుంది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విద్య, పబ్లిషింగ్ సంస్థ పియర్సన్ కూడా ఉంది. జార్జ్‌టౌన్ వర్సిటీకి చెందిన ఏఐ కోల్యాబ్ సంస్థతో కూడా ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. దీని ద్వారా ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్(డీఎంసీసీ)తో కుదిరిన ఎంఓయూ ద్వారా స్టార్ట్‌పల అభివృద్ధికి అవకాశాలను అన్వేషించనున్నారు. రెండు దేశాల మార్కెట్లు, ఎకో సిస్టమ్‌లపై అవగాహన కల్పించడంతో పాటు అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలను నిర్వహించే అంశాన్ని పరిశీలించనున్నారు.