విద్యార్థుల యూనిఫాంపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు.. వచ్చే ఏడాది కొత్త డిజైన్లు
ABN , Publish Date - Sep 19 , 2026 | 09:30 PM
తెలంగాణలో విద్యార్థుల యూనిఫాం విషయంలో ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు యూనిఫాం అందేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, సెప్టెంబర్ 19: విద్యార్థుల యూనిఫాం రూపకల్పన, పంపిణీపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. యూనిఫాంను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో రూపొందించాలని, డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు యూనిఫాంలు అందేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. యూనిఫాం, ఇతర విద్యా సామగ్రి పంపిణీపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జతను ఈ నెలాఖరులోగా అందించనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులందరికీ నోట్‌బుక్స్ పంపిణీ కూడా పూర్తయిందని, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన ఇతర సామగ్రిని కూడా అందించినట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్యను అంచనా వేసేటప్పుడు ప్రస్తుత సంఖ్యకు అదనంగా 10 శాతం వరకు తీసుకుని యూనిఫాంలు, ఇతర సామగ్రి కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది అందించిన యూనిఫాం, ఇతర సామగ్రి నాణ్యతపై తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం పేర్కొన్నారు. వచ్చే ఏడాది కూడా నాణ్యత విషయంలో రాజీ లేకుండా, విద్యార్థులకు సకాలంలో సామగ్రి అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
Read Latest Telangana News And Telugu News