గ్రామీణ తెలంగాణకు శాశ్వత వసతులే లక్ష్యం: మంత్రి సీతక్క
ABN , Publish Date - Sep 25 , 2026 | 06:08 PM
గ్రామీణ తెలంగాణలో రహదారులు, తాగునీరు, నీటి సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. వరంగల్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో మంత్రి సీతక్క మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలకు శాశ్వత మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా భారీ స్థాయిలో రోడ్ల అభివృద్ధి చేపట్టనున్నట్లు వెల్లడించారు.
వరంగల్, సెప్టెంబర్ 25: గ్రామీణ తెలంగాణలో శాశ్వత మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. వరంగల్‌లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ రహదారుల అభివృద్ధిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్లు గేమ్‌చేంజర్‌గా నిలవాలన్నారు. వేల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయబోతున్నామని.. తొలిదశలో 7,448 కి.మీ మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దసరా నాటికి అన్ని ప్యాకేజీల్లో పనులు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పనులను వేగంగా పూర్తి చేసి గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఆవాసం నుంచి రాష్ట్ర రాజధానికి రహదారి సౌకర్యం కల్పించడమే HAM విధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఎల్‌నినో నేపథ్యంలో నీటి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రతి జలాశయంలో నీటి మట్టాలను ప్రతిరోజూ పర్యవేక్షించి.. ఏడాది తాగునీటి అవసరాలను నిర్ధారించాలని సూచించారు. మిషన్ భగీరథలో సమస్యాత్మకంగా ఉన్న 86 జనావాసాల్లో నీటి సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని అన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి గ్రామానికి ఊటకుంట ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. VB-GRAM G లక్ష్యం కూలీకి పని, గ్రామానికి శాశ్వత ఆస్తి అని పేర్కొన్న మంత్రి.. అక్టోబర్ 2న జరిగే గ్రామసభల్లో వచ్చే ఏడాది చేపట్టాల్సిన పనులను ప్రజలతో చర్చించి ఆమోదించాలని తెలిపారు.
ఇవీ చదవండి: