గ్రామీణ భవనాల నిర్మాణంపై మంత్రి సీతక్క సమీక్ష
ABN , Publish Date - Sep 19 , 2026 | 04:17 PM
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామ సమైక్య భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్ష నిర్వహించారు..
హైదరాబాద్, సెప్టెంబర్ 19: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామపంచాయతీ భవనాలు, గ్రామ సమైక్య భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంజూరైన భవనాల పనులను వేగవంతం చేసి.. శాఖల మధ్య సమన్వయంతో సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ శృతి ఓఝా, పంచాయతీరాజ్ ఈఎన్సీ జగదీష్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాల వివరాలను అధికారులు మంత్రికి నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,745 గ్రామ సమైక్య భవనాలు మంజూరు కాగా ఇప్పటివరకు 534 భవనాల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మరో 6,141 భవనాల పనులు పురోగతిలో ఉన్నాయని, 3,070 భవనాల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని వివరించారు. అలాగే 3,906 గ్రామపంచాయతీ భవనాలు మంజూరు కాగా 444 భవనాల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 3,444 భవనాల పనులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
అదేవిధంగా రాష్ట్రంలో 2,313 అంగన్వాడీ భవనాలు మంజూరు చేయగా ఇప్పటివరకూ 200 భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని.. మిగిలిన 2,113 భవనాల పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ భవనాల నిర్మాణం కీలకమని తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగం పెంచాలని.. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పెంచుకుని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. మంజూరైన భవనాల నిర్మాణం సకాలంలో పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
Read Latest Telangana News And Telugu News