బస్సులపై నిరంతర పర్యవేక్షణ
ABN , Publish Date - Oct 23 , 2026 | 06:26 AM
ప్రయాణికుల భద్రత, బస్సుల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
బస్‌భవన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్
బస్సులు, బస్టాండ్లలోని సీసీ కెమెరాలతో అనుసంధానం
ప్రయాణికుల భద్రత, బస్సుల నిర్వహణకు ఊతం
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల భద్రత, బస్సుల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అన్ని బస్సుల్లో, బస్టాండుల్లో ఉన్న సీసీ కెమెరాల్ని, బస్సుల్లో అమర్చిన జీపీఎస్ ట్రాకర్‌ను దీనికి అనుసంధానించారు. దీంతో బస్సుల వేగం, అవి ప్రయాణిస్తున్న మార్గం, సమయపాలనను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించటానికి వీలవుతుంది. బస్సును డ్రైవర్ ఎలా నడుపుతున్నారు, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ ఉపయోగిస్తున్నారా అన్నదానిపైనా నిఘా ఉంచుతారు. తద్వారా ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించనున్నారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఇది కొనసాగుతున్నా.. త్వరలో పూర్తిస్థాయిలో పనిచేయనుంది. బస్సులో అగ్నిప్రమాదం సంభవించినా, ఇతరేతర సాంకేతిక సమస్యలేమైనా తలెత్తి మార్గమధ్యంలో బస్సు నిలిచిపోయినా కంట్రోల్ సెంటర్ నుంచి సంబంధిత అధికారులకు సత్వరమే సమాచారం అందించవచ్చు. సాంకేతిక సిబ్బందిని పంపించడం, ప్రత్యామ్నాయ బస్సులను ఏర్పాటు చేయడం, ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించే చర్యలు చేపట్టడం సులభమవుతుంది. బస్సుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్‌తో అనుసంధానించడం ద్వారా మహిళలు, వృద్ధులు తదితర ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరచవచ్చు. అనుమానాస్పద ఘటనలు, చోరీలు, వేధింపులు చోటుచేసుకున్నప్పుడు అందుబాటులో ఉన్న దృశ్యాలను పరిశీలించి చర్యలు తీసుకునే వీలుంటుంది.
ఈవీ బస్సులకు మరింత ఉపయోగకరం
‘పీఎం ఈ డ్రైవ్’ పథకం కింద ఆర్టీసీలో మొత్తం 2200 ఈవీ బస్సులు దశల వారీగా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 1050 ఈవీ బస్సులు ఆర్టీసీలో ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌లో 540, జిల్లాల్లో 510 బస్సు సర్వీసుల్ని నడుపుతున్నారు. తరచూ ఈవీ బస్సుల్లో సాంకేతిక సమస్యలు తెలెత్తుతున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఈవీ బస్సుల వివరాల్ని అనుసంధానించడం వల్ల ఆ బస్సుల్లో తలెత్తే లోపాలను సత్వరం గుర్తించి మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంటుంది. బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో కూడా అనుసంధానం చేయనున్నారు. పండుగలు, జాతరలు, భారీ ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్ మళ్లింపులు, బస్సుల క్రమబద్ధీకరణకు ఇది ఉపయోగపడనుంది
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?
భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!