Share News

ఓఆర్‌ఆర్‌ చుట్టూ రెట్టింపు!

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:28 AM

రాష్ట్రంలో భూములు, ఓపెన్‌ ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల బహిరంగ మార్కెట్‌ విలువలకు, రిజిస్ట్రేషన్‌ విలువకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం హేతుబద్ధీకరణ చేపట్టనుంది.

ఓఆర్‌ఆర్‌ చుట్టూ రెట్టింపు!

  • రాష్ట్రంలో భూములు, ఫ్లాట్ల మార్కెట్‌ విలువల హేతుబద్ధీకరణకు సర్కారు ఏర్పాట్లు

  • రాజధానిలో చాలా చోట్ల 50శాతం నుంచి 75శాతం పెంపు

  • జిల్లాల్లో 25 శాతం నుంచి 75 శాతం వరకు..ఓఆర్‌ఆర్‌ లోపల ఫ్లాట్ల విలువలు చ.అడుగుకు

  • కనిష్ఠంగా రూ.3000.. గరిష్ఠంగా రూ.7000 వరకు

  • చదరపు గజం రూ.30 వేల నుంచి 60 వేల వరకు

  • జిల్లాల్లో ఎకరం రూ.2.75 లక్షల నుంచి కోటి దాకా..

  • అసలు పెంచని ప్రాంతాలు 10 శాతం లోపే..

  • లావాదేవీలు జరగని, అభివృద్ధికి అవకాశం తక్కువ ఉన్న ప్రాంతాలకు మినహాయింపు

  • తాజా పెంపుతోనూ బహిరంగ మార్కెట్‌

  • విలువల కంటే తక్కువగానే రిజిస్ట్రేషన్‌ విలువలు

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో భూములు, ఓపెన్‌ ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల బహిరంగ మార్కెట్‌ విలువలకు, రిజిస్ట్రేషన్‌ విలువకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం హేతుబద్ధీకరణ చేపట్టనుంది. రాజధాని హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా విలువలను సవరించేందుకు సిద్ధమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఓఆర్‌ఆర్‌ (ఔటర్‌ రింగురోడ్డు) పరిసర ప్రాంతాల్లో భూముల మార్కెట్‌ విలువలు, ఓపెన్‌ ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల విలువలు దాదాపు రెట్టింపు కానున్నాయి. తుక్కుగూడ, రావిర్యాల, కొల్లూరు, మోకిలా, శంకర్‌పల్లి, ముత్తంగి, కీసర తదితర అన్ని ప్రాంతాల్లో 80శాతం నుంచి 100 శాతం వరకు విలువలు పెరగనున్నాయి. ఓఆర్‌ఆర్‌-ఆర్‌ఆర్‌ఆర్‌ (రీజనల్‌ రింగ్‌రోడ్డు) మధ్య ప్రాంతాల్లోనూ ఇంతే స్థాయిలో మార్కెట్‌ విలువలను సవరిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌ నగరంలో పాతబస్తీ, మురికివాడలు ఉన్న చోట్ల స్వల్పంగా పెంచగా.. మరికొన్ని చోట్ల 50 నుంచి 75 శాతం వరకు పెంచుతున్నారు. ఫ్యూచర్‌ సిటీ పరిధిలో 25 నుంచి 50 శాతం వరకు విలువలు పెరగనున్నాయి. జిల్లాల్లో 25శాతం నుంచి 75శాతం మధ్య పెంపు ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలోని 35శాతం ప్రాంతా ల్లో 50-75శాతం మధ్య, 25శాతం ప్రాంతాల్లో 15-25 శాతం మధ్య, మరో 30శాతం ప్రాంతాల్లో 25-50 శాతం మేర విలువలు పెంచినట్టు సమాచారం. అసలు పెంపు లేని ప్రాంతాలు 10శాతం వరకు ఉన్నట్లు తెలిసింది.


శుక్రవారం నుంచే అమల్లోకి!

రాష్ట్రంలో సుమారు 93 వేల ప్రదేశాల్లో మార్కెట్‌ విలువల సవరణపై ప్రభుత్వం కసరత్తు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. ఆయా ప్రాంతాల్లో రోజువారీలావాదేవీలు, బహిరంగ మార్కెట్లో ధరలకు, రిజిస్ట్రేషన్‌ శాఖ కార్డు విలువకు మధ్య వ్యత్యాసం ఆధారంగా విలువలపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. ఇది శుక్రవారం నుంచే అమల్లోకి రానుందని, నూతన మార్కెట్‌ విలువల ప్రకారం స్టాంప్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తయినట్టు పేర్కొన్నాయి. ఈ పెంపు ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్‌ శాఖకు 1,500కోట్ల వరకు అదనంగా రాబడి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించాయి.

డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో పెంపు ఇలా..!

  • తుక్కుగూడ, మంకాల్‌, రావిర్యాలలో పాత మార్కెట్‌ విలువ ఎకరా రూ.78,40,000 ఉండగా.. పెంపు తర్వాత రూ.1,33,28,000 వరకు చేరనుంది. ఇది సుమారు 70 శాతం పెంపు ఉంది. ఈ ప్రాంతాల్లో వాణిజ్య ప్లాట్ల విలువ గజం రూ.10,500 ఉండగా 76 శాతం పెంపుతో రూ.18,400 వరకు పెంచుతున్నారు. శంషాబాద్‌లో గజం వాణిజ్య స్థలం విలువలను ఇదే తరహాలో పెంచారు.

  • కోకాపేట, పరిసర ప్రాంతాల్లో ఎకరా విలువ రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పెంచారు. తెల్లాపూర్‌లో రూ.4 కోట్ల నుంచి 10కోట్ల వరకు, పటాన్‌చెరు ప్రాంతంలో రూ.2.50 కోట్ల నుంచి 5.50 కోట్ల వరకు పెంచారు. కందుకూరు పరిధిలో ఎకరా రూ.50 లక్షల నుంచి 3 కోట్ల వరకు పెరిగింది.

  • రంగారెడ్డి జిల్లా యాచారం పరిధిలో ఎకరా రూ.50 లక్షలలోపు ధర ఉండేలా నిర్ణయించారని తెలిసింది. ఇబ్రహీంపట్నం గ్రామీణ పరిధిలో ఎకరా రూ.15 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు పెంచారు.


  • మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో హిమాయత్‌నగర్‌లో ప్రస్తుతం ఎకరా రూ.82.50 లక్షలు, కనకమామిడిలో ఎకరాకు రూ.52 లక్షలు ఉండగా.. అవి రెండింతలు కానున్నాయి.

  • చౌటుప్పల్‌ పరిధిలో ఎకరాకు రూ.60 లక్షల నుంచి కోటి వరకు పెంపు ఉన్నట్లు తెలిసింది.

  • ఇక ఓఆర్‌ఆర్‌ అవతల, పాత హెచ్‌ఎండీఏ పరిధిలో ఎకరా కనిష్ట విలువ రూ.10 లక్షలుగా నిర్ణయించారు. మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో రూ.5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2.75 లక్షలు కనిష్ట విలువగా నిర్ణయించారు.

  • ఓఆర్‌ఆర్‌ లోపల కోర్‌ అర్బన్‌ పరిధిలో అపార్ట్‌మెంట్లకు చదరపు అడుగు కనిష్ట విలువ 3,000గా నిర్ణయించారు. ఓపెన్‌ ప్లాట్లకు సంబంధించి చదరపుగజం ధర కనీసవిలువ 2,000గా నిర్ణయించారు.

  • అమీర్‌పేటలో వాణిజ్య స్థలం చదరపు గజం ప్రస్తుతం రూ.93,000 వరకు ఉండగా రూ.1,16,000 వరకు పెరగనున్నాయి.

  • అమీర్‌పేటతోపాటు ఖైరతాబాద్‌, ఆనంద్‌నగర్‌, ఎర్రమంజిల్‌ కాలనీల్లో నివాస స్థలాల విలువను రూ.48,700 నుంచి 60,000కు పెంచనున్నారు.

  • పాత హెచ్‌ఎండీఏ పరిధిలో చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ)కు అపార్ట్‌మెంట్లలో రూ.2,050గా, ఓపెన్‌ ప్లాట్లకు చదరపు గజం కనిష్ట ధర రూ.1,500గా నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో ఎకరా కనీస విలువ రూ.10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతున్నారు.

  • శంకర్‌పల్లి పరిధిలో ఫ్లాట్ల విలువలు చదరపు అడుగుకు ప్రస్తుతం రూ.2,500 ఉండగా, రూ.5,500 వరకు పెంచినట్లు తెలిసింది. మోకిలాలో 2,100 ఉండగా దాన్ని 4,000వరకు పెంచారని సమాచారం.

  • జిల్లాల్లో డిమాండ్‌, లావాదేవీల ఆధారంగా వాణిజ్య స్థలం విలువలను పెంచుతున్నట్టు తెలిసింది. ఉదాహరణకు ఖమ్మం మయూరి సెంటర్‌లో వాణిజ్య స్థలం గజం ధర రూ.25,000 ఉండగా రూ.35,000 వరకు.. నిర్మల్‌లో రూ.12,500 నుంచి రూ.17,600కు, దిలావర్‌పూర్‌లో పంచాయతీలో రూ.700 ఉన్న ధరను రూ.1,000కు పెంచినట్టు తెలిసింది.

పెంచినా.. తక్కువే!

ప్రభుత్వం ప్రస్తుతం పెంచుతున్న రిజిస్ట్రేషన్‌ విలువలకు, బహిరంగ మార్కెట్‌ విలువలకు ఇంకా భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం. మాదాపూర్‌, కొండాపూర్‌, కొత్తగూడ, మణికొండ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లను చదరపు అడుగుకు రూ.10,000 వరకు ధరతో విక్రయిస్తున్నారు. దీని ప్రకారమే పెద్ద బిల్డర్లు స్టాంపు డ్యూటీ కట్టిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ విలువలు రూ.3,000-రూ.3,800 మధ్య ఉన్నాయి. తాజా పెంపుతో రూ.7,000 వరకు చేరనున్నాయి. అంటే బహిరంగ మార్కెట్‌ ధరకన్నా తక్కువే. ఇటీవల టీజీఐఐసీ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో భూములను వేలం వేయగా.. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఎకరా రూ.237 కోట్లకు కొనుగోలు చేశారు. అక్కడి రిజిస్ట్రేషన్‌ ధరలకు, దీనికి పొంతనే లేదు.

Updated Date - Jun 04 , 2026 | 07:37 AM