దసరా.. మస్తుగా.. మత్తుగా
ABN , Publish Date - Oct 22 , 2026 | 02:47 AM
దసరా పండుగ ఎప్పటిలాగే ప్రభుత్వానికి భారీగా కాసులు రాల్చింది. అయితే ఈసారి మాత్రం గత రికారులన్నింటినీ బద్దలు కొట్టింది.
దసరా.. మస్తుగా.. మత్తుగా
పండుగతో భారీగా మద్యం విక్రయాలు
నాలుగు రోజుల్లోనే రూ.755 కోట్ల అమ్మకాలు
మద్యం ప్రియుల జల్సాకు గత రికార్డులు బద్దలు
ఈ నెలలో ఇప్పటికే రూ.2,055 కోట్లకు చేరిక
హైదరాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ ఎప్పటిలాగే ప్రభుత్వానికి భారీగా కాసులు రాల్చింది. అయితే ఈసారి మాత్రం గత రికారులన్నింటినీ బద్దలు కొట్టింది. మద్యం ప్రియులు గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈసారి మద్యాన్ని కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రంలో ఈసారి మద్యం విక్రయాల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. పండుగకు ముందు కేవలం నాలుగు పనిదినాల్లోనే ఏకంగా రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. సాధారణ రోజుల కంటే పండుగ సమయంలో మద్యం విక్రయాలు పెరగడం సహజమే అయినప్పటికీ.. ఈసారి నమోదైన లెక్కలు మాత్రం గత రికార్డులన్నింటినీ మించిపోయాయి. దీంతో ఎక్సైజ్‌శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. ముఖ్యంగా పండుగకు ముందురోజైన ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.303.40 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. దసరా ముం దస్తు విక్రయాల సరళిని పరిశీలిస్తే.. అక్టోబరు 14న రూ.102.17 కోట్ల విక్రయాలు జరిగాయి. 15న డిపోలకు సెలవు కాగా...తిరిగి 16న రూ.126.32 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక 17న ఏకంగా రూ.223.25 కోట్ల మద్యం అమ్ముడైంది. 18న ఆదివారం కావడంతో ఆరోజు కూడా డిపోలకు సెలవు. అయితే 19న మాత్రం మునుపెన్నడూ లేని స్థాయిలో వ్యాపారం జరిగింది. విక్రయాల రకాల విషయానికి వస్తే.. ఎప్పటిలాగే బీర్ల హవా కొనసాగింది.
ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే మొత్తం 10.44 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా.. 6.83 లక్షల కేసుల హార్డ్ లిక్కర్ విక్రయాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలతో అక్టోబరు 19 నాటికి ఈ ఒక్క నెలలోనే మొత్తం మద్యం అమ్మకాలు రూ.2,055 కోట్లకు చేరుకున్నాయి. గతంలో సెప్టెంబరు నెలలో రూ.3,209 కోట్లు, ఆగస్టులో రూ.3,482 కోట్ల విక్రయాలు జరగగా, దసరా సీజన్ కావడంతో అక్టోబరు ముగిసేసరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది దసరా సీజన్ నాలుగు రోజుల్లో నమోదైన రూ.698 కోట్లతో పోలిస్తే.. ఈసారి విక్రయాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలోని 17 డిపోల ద్వారా సరఫరా అయ్యే మద్యాన్ని.. వ్యాపారపరంగా 2,620 వైన్‌షాపులు, 1,113 బార్ అండ్ రెస్టారెంట్లు, ఇవి కాకుండా పబ్బులు, క్లబ్బుల ద్వారా విక్రయిస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎర్రవెల్లిలో మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో ఘనంగా దసరా వేడుకలు