Share News

ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు

ABN , Publish Date - May 24 , 2026 | 04:31 AM

వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, బయోటెక్‌, మెడికల్‌ ఇన్నోవేషన్‌ వంటి రంగాల్లో రూ.2.4 లక్షల కోట్ల....

ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు

2.4 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, మెడికల్‌ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ

రెండో విడత కింద 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

నియోజకవర్గానికి 2 వేలు మంజూరు

క్యూర్‌ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఎల్‌పీజీ వర్గాలకు లక్ష గృహాలు

జూన్‌ 1న కొఠారిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు.. పాల్గొననున్న సీఎం

జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, పాఠశాలల్లో అల్పాహార పథకం

మార్క్‌ఫెడ్‌లో డీసీఎంఎస్‌లు, హాకాలో టీజీఆర్‌ఐసీ విలీనం

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.587 కోట్లు మంజూరు

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, బయోటెక్‌, మెడికల్‌ ఇన్నోవేషన్‌ వంటి రంగాల్లో రూ.2.4 లక్షల కోట్ల (25 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత కింద 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం శనివారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశ నిర్ణయాలను మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‪ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. 2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోని టాప్‌ 5 లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని మంత్రి చెప్పారు. అందులో భాగంగానే ‘నెక్ట్స్‌ జనరేషన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ-2026-30’కి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. దావోస్‪లో ఈ పాలసీని లాంఛనంగా ఆవిష్కరించినట్లు గుర్తుచేశారు. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలతో పాటు రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, బయోటెక్‌, మెడికల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామన్నారు. యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్‌ హెల్త్‌, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఎక్కువగా తయారీ రంగంపై దృష్టి పెట్టగా, ఇక నుంచి ఇన్నోవేషన్‌పై దృష్టి సారించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ (ఆర్‌ అండ్‌ డీ) యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించే విధంగా ఈ పాలసీలో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. గ్లోబల్‌ కేపబిలిటీ, ఇన్నోవేషన్‌ సెంటర్లు తెలంగాణకు రావడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని అన్నారు.


మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత కింద 2.50 లక్షల ఇళ్లను మంజూరుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని పొంగులేటి వెల్లడించారు. ఈ విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మొదటి దశలో ప్రభుత్వం 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసి, వాటి నిర్మాణానికిరూ.22,800 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి ఇచ్చే 2,000 ఇళ్లలో 1,500 ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున అందజేస్తామని చెప్పారు. మిగిలిన 500 ఇళ్లను గతంలో వివిధ కారణాల వల్ల అసంపూర్తిగా ఉండిపోయిన ఇందిరమ్మ, డబుల్‌ బెడ్‌రూమ్‌, ఇతర ఇళ్ల స్థానంలో కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మంజూరై.. గోడలు, శ్లాబుల దశలో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు పొంగులేటి తెలిపారు. మహబూబ్‌నగర్‌, తాండూరు వంటి ప్రాంతాల్లో ఇలాంటి అసంపూర్తి ఇళ్లు ఉన్నాయని చెప్పారు. పునాదులు పూర్తయ్యి గోడలు, శ్లాబులు పడని ఇళ్లకు రూ.3 లక్షలు, శ్లాబు స్థాయిలో నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షల చొప్పున అందిస్తామని తెలిపారు. ఇలాంటి ఇళ్లకు 3, 4 విడతల్లో కూడా ప్రాధాన్యమిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14,800 పూరి గుడిసెలు ఉన్నట్లు గృహ నిర్మాణ శాఖ సర్వేలో తేలిందని.. ఆ ఇళ్లలో ఉంటున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు వివరించారు. గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని క్యాబినెట్‌ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని క్యూర్‌ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల (ఎల్‌ఐజీ) వారి కోసం లక్ష ఇళ్లు నిర్మించి ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయించినట్లు వివరించారు. క్యూర్‌ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో 6 లక్షల మంది అర్హులున్నట్లు తెలిపారు. వీరిలో సొంతంగా ఇళ్ల స్థలాలు ఉన్నవారు 18,500 మంది మాత్రమేనని, వీరికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. మిగతావారి కోసం ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలుగా విభజించి, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ భూముల్లో నిరుపేదలకు ఇళ్లతో పాటు అవిభజిత భూ వాటా (యూడీఎ్‌స)ను ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. 420 చదరపు అడుగుల్లో ఇంటిని నిర్మించి ఇస్తామని వెల్లడించారు. లబ్ధిదారులు నివసించే ప్రాంతాల్లోనే వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. వీటికి సంబంధించి త్వరలోనే విధి విధానాలను విడుదల చేస్తామన్నారు. ఎంఐజీకి సంబంధించి ఈ కోర్‌ అర్బన్‌ ప్రాంతంలో 30 శాతం ఇళ్లు నిర్మించి, అందులో యూడీఎ్‌సతో పాటు నిర్మాణ వ్యయం భరించాలని క్యాబినెట్‌ నిర్ణయించినట్లు వెల్లడించారు. గతంలో 30- 40 కిలో మీటర్ల దూరంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టడంతో అక్కడికి లబ్ధిదారులు వెళ్లలేక ఇళ్లను వదిలేశారని అన్నారు. అందుకే తాము లబ్ధిదారులు ప్రస్తుతం నివసించే ప్రాంతంలోనే ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.


గోదావరి పుష్కరాలకు రూ.1,000 కోట్లు

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనులు చేపట్టేందుకు రూ.1,000 కోట్లు మంజూరు చేసేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో తొలి విడతగా రూ.300 కోట్లను మంజూరు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పొంగులేటి వెల్లడించారు. ప్రభుత్వం పాఠశాలలతో పాటు అన్ని జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు పాలు అందించాలని నిరయించినట్లు తెలిపారు. డీసీఎంఎస్‌లను మార్క్‌ఫెడ్‌లో, టీజీఆర్‌ఐసీని హాకాలో విలినం చేయాలని క్యాబినెట్‌ నిరయించిందని వివరించారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల భూ సేకరణ, పునరావాసం, మౌలిక వసతులకు 587 కోట్ల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పనులను గతంలో 21 భాగాలుగా విభజించి, 18 భాగాలపైనే దృష్టి పెట్టారని.. అందుకే తాము లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ వరకు పనులను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఆర్‌డీఎస్‌ఎస్‌‌లోకి డిస్కంలు

విద్యుత్తు పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్‌ఎస్‌)లో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్రపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ పథకంలో చేరడానికి గత ప్రభుత్వం 2017 జనవరి 2న త్రైపాక్షిక ఒప్పందం చేసుకుందని తెలిపారు. కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్‌) మధ్య ఈ ఒప్పందం జరిగినట్లు చెప్పారు. అయితే, దానిని అమల్లోకి తీసుకురాలేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగిందని చెప్పారు. విద్యుత్తు రంగాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అన్ని రాష్ట్రాలు ఆర్‌డీఎస్‌ఎస్‌లో చేరాయని, తెలంగాణలోనూ మెరుగైన విద్యుత్తు సరఫరా కోసం అందులో చేరాలని క్యాబినెట్‌ నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, దీనిలో మీటర్ల బిగింపు ప్రసక్తి ఎక్కడా ఉండదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందంలో మీటర్ల అంశంపైనా సంతకం పెట్టిందని తెలిపారు.


వచ్చే నెల 2 నాటికి లక్ష ఇళ్ల గృహప్రవేశం

తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్‌ రెండో తేదీనాటికి దాదాపు లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు జరుగుతాయని మంత్రి పొంగులేటి తెలిపారు. కుమ్రంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్‌ 1వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులంతా పాల్గొంటామని తెలిపారు.

Updated Date - May 24 , 2026 | 04:31 AM