Share News

పంచాయతీలపై ఇక పెత్తనం లేదు!

ABN , Publish Date - May 27 , 2026 | 05:20 AM

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న 50 వేల మంది సిబ్బందికి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ప్రతీ నెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

పంచాయతీలపై ఇక పెత్తనం లేదు!

  • ఆదాయం బ్యాంకు ఖాతాలో వేసుకోవచ్చు

  • ఖజానాలో వేసి తీసుకొనే పద్ధతి ఎత్తేయండి

  • ఆ మేరకు పంచాయతీరాజ్‌ చట్ట సవరణ

  • పంచాయతీల్లో సిబ్బందికి ఒకటినే వేతనం

  • వాటిల్లో పనిచేసే 50 వేల మందికి ఊరట

  • ప్రభుత్వ ఖజానా నుంచి నెలనెలా రూ.50 కోట్లు

  • పెన్షనర్ల సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి

  • పోస్టాఫీసు ద్వారా చెల్లింపుల పద్ధతి నిలిపివేత

  • కొత్త పెన్షన్లలో ఒంటరి మహిళకు తొలి ప్రాధాన్యం

  • పంచాయతీరాజ్‌ సమీక్షలో రేవంత్‌ నిర్ణయాలు

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న 50 వేల మంది సిబ్బందికి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ప్రతీ నెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఐఏఎస్‌ అధికారులకు అందినంత పక్కాగా పంచాయతీ సిబ్బందికి ఒకటో తేదీనే జీతాలు అందాలన్నారు. మంగళవారం రాత్రి ఆయన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష జరిపారు. మంత్రి సీతక్క రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఐఏఎస్‌లు సందీప్‌ కుమార్‌ సుల్తానియా, దానకిశోర్‌, డి.దివ్య, మాణిక్‌ రాజ్‌ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల్లో సిబ్బందికి ఒకటినే జీతాలు చెల్లించడానికి వీలుగా ప్రభుత్వం వాటాగా ప్రతీ నెలా రూ.50 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. పంచాయతీ సిబ్బందికి జీతం ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకొనేది లేదన్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీల్లో జమ చేయాల్సిన అవసరం లేకుండా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే వేసుకొనేందుకు అనుమతించాలని అధికారులు చేసిన సూచనను ఆమోదించారు. గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం ట్రెజరీ నిబంధనను తీసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు. దీన్ని మార్చడం కోసం తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018 లోని సెక్షన్‌ 70(3)ను సవరించాలని నిర్ణయించారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి మరో కీలకమైన ఆదేశాన్ని జారీ చేశారు. ప్రస్తుతం పెన్షన్లు పోస్టల్‌ శాఖ ద్వారా అందజేస్తున్నారు. దాన్ని మార్చాలని, ఇక నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సీఎం ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన వారికే పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఓటర్‌ ఐడీ, ఆధార్‌, ఎస్‌ఈఈఈపీసీ డేటా ఆధారంగా పెన్షన్లను క్రమబద్ధం చేయాలన్నారు. కొత్తగా మంజూరు చేసే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Updated Date - May 27 , 2026 | 05:53 AM