ధాన్యం కొనుగోలుపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - May 06 , 2026 | 05:48 PM
ధాన్యం కొనుగోలు విషయంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ.. రైతులను ఆందోళనకు గురిచేయడంపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మే 06: ధాన్యం కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తూ.. రైతులను ఆందోళనకు గురిచేయడంపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అంశంపై ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తూ, రైతులను అయోమయానికి గురిచేయడానికి ప్రయత్నిస్తోందన్నారు మంత్రి ఉత్తమ్. తమ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తోందని, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఈ రబీలో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. దాదాపు 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. ఇందులో భాగంగా 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 17.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం 2.63 లక్షల టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అకాల వర్షాలు, తీవ్రమైన ఎండల (హీట్ వేవ్) నుంచి ధాన్యాన్ని, రైతులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు, ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది’ అని మంత్రి ఉత్తమ్ అన్నారు.
ఇవి కూడా చదవండి...
శ్రీసిటీలో ఏసీ పరిశ్రమలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
నెల్లూరులో మహానాడు పనులకు భూమి పూజ.. పాల్గొన్న మంత్రులు