Share News

కొనుగోళ్లలో మాదే రికార్డు

ABN , Publish Date - May 30 , 2026 | 04:48 AM

ప్రస్తుత సీజన్‌లో దేశంలో అత్యధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

కొనుగోళ్లలో మాదే రికార్డు

  • ఇప్పటికే 60 లక్షల టన్నులు కొనుగోలు చేశాం

  • ఏపీ 24, తమిళనాడు 12, మహారాష్ట్రలో 3 లక్షల టన్నులే సేకరణ

  • రైతులకు ఈ నెల 28 నాటికి రూ.11,050 కోట్లు చెల్లించాం

  • వరి ఉత్పత్తి పెరుగుతుంటే.. సేకరణ టార్గెట్‌ను కేంద్రం ఏటా తగ్గిస్తోంది

  • బీజేపీ నేతలు కల్లాల చుట్టూ తిరిగే బదులు ఢిల్లీకి వెళ్లి టార్గెట్‌ పెంచాలి

  • బీఆర్‌ఎస్‌ హయాంలో టార్గెట్‌లో ఎన్నడూ 50శాతం మించి కొనలేదు

  • పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

  • ఎమ్మెస్పీ ప్రకటించి వదిలేస్తే.. పంటనంతా ఎవరు కొనాలి?: తుమ్మల

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సీజన్‌లో దేశంలో అత్యధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుచేస్తే... ఏపీలో 24 లక్షలు, తమిళనాడులో 12 లక్షలు, మహారాష్ట్రలో 3 లక్షలు, కేరళలో 2 లక్షల టన్నులు మాత్రమే సేకరించారని చెప్పారు. కేంద్రం అనుమతిచ్చిన దానికి మించి రూ.16,479 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డిలతో కలిసి సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ధాన్యం, బియ్యం సేకరణ కోటా కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఒకవైపు రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరుగుతుంటే.. కేంద్రం ఎఫ్‌సీఐ సేకరణ టార్గెట్‌ను ఏటా తగ్గిస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు కల్లాల చుట్టూ తిరిగేబదులు, ఢిల్లీకి వెళ్లి అదనపు కోటా తీసుకురావాలని సూచించారు. ధాన్యం సేకరణపై ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 8,575 సెంటర్లలో కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని, చివరి ధాన్యం గింజను కొనుగోలుచేసేదాకా సెంటర్లను తెరిచే ఉంచుతామని తెలిపారు.


టార్గెట్‌కు మించి ధాన్యం కొనుగోళ్లు

రాష్ట్రంలో యాసంగిలో 141 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే, 75 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేసినట్లు మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు. కేంద్రం కేవలం 52 లక్షల టన్నులకే అనుమతి ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 24 లక్షల టన్నులు కొనుగోలు చేస్తోందని వివరించారు. 13,000 వాహనాల్లో ధాన్యం మిల్లులకు తరలిస్తున్నారని, 2 లక్షల మంది సిబ్బంది అందుకోసం పనిచేస్తున్నారని వివరించారు. 2,008 రైస్‌మిల్లులు, 20.86 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీనాటికి రూ.11,050 కోట్లు రైతులకు చెల్లించినట్లు చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కేకొంటామని అన్నారు. 60 లక్షల టన్నుల్లో 10 వేల టన్నులు తడిస్తే బాయిల్డు మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. ఇసుక, సిమెంటు లారీలను కూడా ధాన్యం రవాణాకు మళ్లించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. గత పాలకులు పదేళ్లలో ఏటా సగటున రూ.15 వేల కోట్ల ఎమ్మెస్పీ చెల్లిస్తే... తాము ఏడాదికి రూ.49 వేల కోట్లు చెల్లిస్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం విధించిన టార్గెట్‌లో 50- 60 శాతమే కొనేవారని విమర్శించారు.

ప్రజలు అసహ్యించుకునేలా బీజేపీ తీరు: తుమ్మల

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల నేతలు ఇంగిత జ్ఞానంలేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మండిపడ్డారు. వాస్తవాలు వక్రీకరించి, ప్రజలు అసహ్యించుకునేలా బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పంజాబ్‌, హరియాణా తదితర రాష్ట్రాల్లో పండిన పంటనంతా కేంద్రం కొనుగోలు చేస్తూ.. తెలంగాణ రైతులకు మాత్రం ద్రోహం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో మిగిలిన కోటి టన్నుల ధాన్యం ఎవరు కొంటారని ప్రశ్నించారు. మక్కలు క్వింటాలుకు కేంద్రం రూ.2,400 ఎమ్మెస్పీ ప్రకటించి వదిలేస్తే రైతులు రూ.1,400 - 1,500లకే అమ్ముకోవాల్సి వస్తోందని అన్నారు. కేంద్రం ఎమ్మెస్పీ ప్రకటించి చేతులెత్తేస్తే ఎవరు కొనాలని తుమ్మల నిలదీశారు. 11 లక్షల టన్నుల యూరియా కావాలని 3 నెలలుగా కోరుతుంటే.. 10 లక్షల టన్నులు ఇస్తామని చెప్పి, 5 లక్షల టన్నులు కూడా పంపలేదని విమర్శించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తమ సమావేశాలకు రైతులు రాకపోవటంతో బీఆర్‌ఎస్‌ నేతలు మిలిటెంట్‌ తరహా పోరాటాలకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల నుంచి ప్రజల దృష్టిని మళ్లించటానికే బీజేపీ రైతుగోస యాత్ర చేపట్టిందని విమర్శించారు. వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే.. అందుకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Updated Date - May 30 , 2026 | 04:48 AM