Share News

ఏఐ ఆధారిత వ్యవసాయ సేవలకు ‘భారత్‌ విస్తార్‌’

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:31 AM

రైతులకు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఆధారిత సేవలను తెలుగులోనే అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

ఏఐ ఆధారిత వ్యవసాయ సేవలకు ‘భారత్‌ విస్తార్‌’
Tummala Nageswara Rao

  • రైతుల ప్రశ్నలకు తెలుగులో వాయిస్‌ అసిస్టెంట్‌ సమాధానాలు

  • వ్యవసాయశాఖ, ఎన్‌ఐఎస్‌జీ మధ్య అవగాహన ఒప్పందం

హైదరాబాద్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రైతులకు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఆధారిత సేవలను తెలుగులోనే అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఏఐ ఆధారిత జాతీయ వ్యవసాయ డిజిటల్‌ వేదిక ‘భారత్‌ విస్తార్‌’తో తెలంగాణను అనుసంధానించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌ (ఎన్‌ఐఎస్‌జీ) మధ్య గురువారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమక్షంలో ఒప్పందం జరిగింది. సాధారణంగా రైతులు పంటల సాగు, వాతావరణం, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ, మార్కెట్‌ ధరలు, ప్రభుత్వ పథకాల సమాచారం కోసం వివిధ కార్యాలయాలు, వెబ్‌సైట్లు, యాప్‌లపై ఆధారపడాల్సి వస్తుంది.


ఈ సమస్యకు పరిష్కారంగా భారత్‌ విస్తార్‌ ఒకే డిజిటల్‌ వేదిక ద్వారా అవసరమైన సమాచారం అందిస్తుంది. ఈ వేదికలో పొందుపరిచిన ‘భారతి’ అనే కృత్రిమ మేధ ఆధారిత వాయిస్‌ అసిస్టెంట్‌... రైతులతో సంభాషిస్తూ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. రైతులు తమకు ఎదురైన సమస్యలను వారి మాతృభాషలో మాట్లాడి లేదా టైప్‌ చేసి అడగవచ్చు. రైతు అడిగిన ప్రశ్నను విశ్లేషించి, అందుబాటులో ఉన్న శాస్త్రీయ సమాచారం, ప్రభుత్వ డేటా ఆధారంగా సూచనలు అందించడం దీని ప్రత్యేకత. భారత్‌ విస్తార్‌లో ఆరు కీలక సేవలు అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో ఇప్పటికే సిద్థంగా ఉన్న జాతీయ చాట్‌బాట్‌, వాయిస్‌ బాట్‌ సేవలను తెలుగులో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రత్యేక రాష్ట్రస్థాయి పోర్టల్‌, తెలుగు యాప్‌ను 15 నుంచి 21 రోజుల్లో అందుబాటులోకి తెచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. వాట్సాప్‌ చాట్‌బాట్‌ ద్వారా రైతులు తమ సందేహాలను పంపించి సమాధానాలు పొందే సదుపాయాన్ని 45 నుంచి 60 రోజుల్లో ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు. వచ్చే 6 నెలల నుంచి ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వ్యవసాయశాఖ సర్క్యులర్లను దశలవారీగా ఈ వేదికలో చేర్చనున్నారు. భారత్‌ విస్తార్‌ వేదికను రాష్ట్ర రైతులకు మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి..

మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు

Updated Date - Nov 13 , 2026 | 04:32 AM