Share News

ధాన్యం విలువకు 5 రెట్ల పరపతి ధ్రువీకరణ పత్రం

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:40 AM

ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌ (సీఎంఆర్‌) వ్యవహారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 2026-27 సంవత్సరానికి కొత్తగా రూపొందించిన ఒప్పందంలో కఠిన నిబంధనలు పొందుపరిచింది

ధాన్యం విలువకు 5 రెట్ల పరపతి ధ్రువీకరణ పత్రం
rice

  • రైస్‌ మిల్లర్లకు సాల్వెన్సీ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం

  • ధాన్యం పక్కదారి పట్టిస్తే 25 శాతం జరిమానా, 12శాతం వడ్డీ

  • అక్రమాలు చేస్తే ఆస్తుల జప్తు.. సీఎంఆర్‌ ఒప్పందంలో నిబంధనలు

  • రైస్‌ మిల్లర్లకు సాల్వెన్సీ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం

  • గ్యారంటీదారులపైనా చర్యలు2026-27 సంవత్సరానికి సీఎంఆర్‌ ఒప్పందంలో కఠిన నిబంధనలు

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌ (సీఎంఆర్‌) వ్యవహారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 2026-27 సంవత్సరానికి కొత్తగా రూపొందించిన ఒప్పందంలో కఠిన నిబంధనలు పొందుపరిచింది. ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించిన ఆస్తిగా కాకుండా కార్పొరేషన్‌ తరపున బాధ్యతగా నిల్వ చేయాల్సిన ఆస్తిగా పేర్కొంది. సీఎంఆర్‌ సకాలంలో అప్పగించకపోయినా, ధాన్యం నిల్వల్లో తేడాలు వచ్చినా, పక్కదారి పట్టించినా మిల్లర్లతోపాటు గ్యారంటీదారులపైనా చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించింది. రైస్‌ మిల్లర్ల నుంచి ధాన్యం విలువకు సమానమైన చెక్కులను బ్యాంకు ధ్రువీకరణతో తీసుకోవాలని, మిల్లింగ్‌కు కేటాయించిన ధాన్యం విలువపై రైస్‌ మిల్లర్‌ 5 రెట్లు ఆస్తుల సాల్వెన్సీ సర్టిఫికెట్‌ (పరపతి ధ్రువీకరణ పత్రం) సమర్పించాలని ఒప్పందంలో పేర్కొంది.అదనంగా ఇద్దరు ఆర్థికంగా పరిపుష్టి కలిగిన, డిఫాల్ట్‌ చరిత్రలేని ఇతర రైస్‌ మిల్లర్ల నుంచి గ్యారంటీ తీసుకోవాలనే నిబంధన కూడా విధించింది. గతంలో డిఫాల్ట్‌ అయిన మిల్లర్లు పూర్తి బకాయులు, జరిమానాలు చెల్లించకపోతే ధాన్యం కేటాయించేదిలేదని స్పష్టం చేసింది. లీజుకు తీసుకున్న మిల్లులైతే కేటాయించిన ధాన్యం విలువలో 50 శాతం మేర ఈ-బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని, మిల్లర్ల కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తుల వివరాలు, వాటిపై ఉన్న తనఖా వివరాలు కూడా వెల్లడించాలని ప్రభుత్వం సూచించింది.


సీఎంఆర్‌ సకాలంలో అందించని మిల్లర్ల నుంచి ధాన్యం విలువను వసూలు చేయటంతోపాటు 25 శాతం జరిమానా, ఏడాదికి 12 శాతం వడ్డీ విధిస్తామని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ జరిమానా మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద భూమి శిస్తు బకాయిగా వసూలు చేసే అధికారం పౌరసరఫరాల సంస్థకు కల్పించింది. డిఫాల్టర్‌ మిల్లుల మిగిలిన ఉప ఉత్పత్తులను కలెక్టర్‌ స్వాధీనం చేసుకొని వేలం వేయొచ్చని, ధాన్యం అందుబాటులో లేకపోయినా ఇతర పద్ధతుల్లో బకాయిలు వసూలుచేసేలా, మిల్లర్‌ పాటు ఇద్దరు గ్యారంటీదారుల నుంచి ఉమ్మడిగా, విడివిడిగా బకాయులు వసూలు చేసేలా నిబంధనలు రూపొందించారు. ప్రభుత్వ ధాన్యాన్ని ప్రైవేటు ధాన్యంతో కలిపి వ్యాపారం చేయటం, ఇతర సీజన్ల ధాన్యాన్ని కలపటం, పీడీఎస్‌ బియ్యాన్ని కొనడం, ఆ బియ్యాన్ని సీఎంఆర్‌ కింద అప్పగించే ప్రయత్నం చేయటాన్ని తీవ్రమైన ఉల్లంఘనలుగా ప్రకటిస్తామని ప్రభుత్వం ఒప్పంద పత్రంలో స్పష్టంచేసింది. ధాన్యం మిల్లింగ్‌ పూర్తిచేసి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మొత్తం బియ్యాన్ని ఎఫ్‌సీఐకి గానీ, పౌరసరఫరాల సంస్థకు గానీ అప్పగించడంతోపాటు ధాన్యం, గోనెసంచులు, సీఎంఆర్‌, ఎఫ్‌ఆర్‌కే లెక్కలు సరిచూసిన తర్వాతే మిల్లింగ్‌ చార్జీలు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నష్టాలు, నాణ్యత కోతలు, ఇతర బకాయులుంటే వాటిని మినహాయిస్తామని, బియ్యం అప్పగింతలో టార్గెట్‌ పూర్తిచేయని మిల్లర్ల నుంచి ధాన్యాన్ని ఇతర మిల్లులకు తరలించి మిల్లింగ్‌ చేయించే అధికారం కలెక్టర్లకు ఉంటుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు

Updated Date - Nov 13 , 2026 | 04:03 AM