Share News

రంగారెడ్డి కలెక్టర్‌కు 6 నెలల జైలుశిక్ష

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:22 AM

నిషేధిత జాబితా భూములకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికి ఆరునెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

రంగారెడ్డి కలెక్టర్‌కు 6 నెలల జైలుశిక్ష
jail

  • కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీర్పు

  • నిషేధిత జాబితా నుంచి ప్లాట్లను తొలగించనందుకు..

  • అప్పీలుకు వీలుగా శిక్ష అమలు

  • 4 వారాలు నిలిపివేత

హైదరాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): నిషేధిత జాబితా భూములకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికి ఆరునెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అప్పీలుకు అవకాశం కల్పిస్తూ జైలుశిక్ష అమలును నాలుగువారాలపాటు నిలిపివేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయంజాల్‌ రెవెన్యూ గ్రామ పరిధిలోని మన్నె ముత్యాలమ్మ కుంట సర్వే నెంబర్‌ 536, 537, 657, 658లలో పిటిషనర్లు పీ శివలీల, పీ వెంకటేశ్వర్లుకు చెందిన ప్లాట్‌ నెంబర్లు 62, 59లను రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌-1908 సెక్షన్‌ 22ఏ (నిషేధిత జాబితా) నుంచి తొలగించాలని పేర్కొంటూ జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం గతంలో తీర్పు ఇచ్చింది. 60 రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే, 60 రోజులు పూర్తయినప్పటికీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ తగిన చర్యలు తీసుకోకపోవడంతో పిటిషనర్లు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. కలెక్టర్‌ కోర్టు ఉత్తర్వులు పాటించకపోవటమేగాక, నిషేధిత జాబితా నుంచి తమ ప్లాట్లను తొలగించాలన్న దరఖాస్తును తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. 18 ఏళ్ల కింద ల్యాండ్‌ రిఫామ్స్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును కలెక్టర్‌ తన ఉత్తర్వులను కారణంగా చూపుతున్నారని.. అయితే ఆ కేసు అప్పీల్‌ దశలో తిరస్కరణకు గురైన విషయాన్ని కలెక్టర్‌ పట్టించుకోలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ల్యాండ్‌ రిఫామ్స్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం ఇప్పటికే కొన్ని ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించారని.. మిగతా వాటిని తొలగించకుండా కారణాలు చెప్పడాన్ని ఆక్షేపించింది. అదే లేఅవుట్‌లో పిటిషనర్ల ప్లాటు పక్కన ఉన్న మరో ప్లాటును అప్పటి జిల్లా కలెక్టర్‌ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ 2022లో ఉత్తర్వులు జారీచేసిన విషయాన్ని ప్రస్తుత కలెక్టర్‌ పట్టించుకోలేదని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా, ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఆరునెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. కాగా ఈ తీర్పుపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ దాఖలు చేశారు.


స్టే ఉత్తర్వులను పట్టించుకోనందుకు..

మరో కోర్టు ధిక్కరణ కేసులో రిజిస్ట్రేషన్లశాఖకు చెందిన ముగ్గురు అధికారులకు జైలుశిక్ష పడింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ పీ శ్రీను, జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌లు వీ అశోక్‌, పీ మధుబాబులకు ఆరునెలల జైలుశిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ జస్టిస్‌ కే లక్ష్మణ్‌, జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు జారీచేసింది. ఇదే కేసులో ఏడీఆర్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎండీ సీహెచ్‌ దామోదర్‌రావుకు సైతం జైలుశిక్ష పడింది. హైదరాబాద్‌ బాచుపల్లి గ్రామపరిధిలోని సర్వే నెంబర్‌ 140లోని 10 ఎకరాల భూమి విషయంలో ద్విసభ్య ధర్మాసనం స్టే ఇచ్చినప్పటికీ ఆ స్టే ఉత్తర్వులను పట్టించుకోకుండా ఏడీఆర్‌ ఎస్టేట్స్‌ సమర్పించిన డాక్యుమెంట్లను సబ్‌రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. కంపెనీ ఎండీతోపాటు అధికారులకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ జైలుశిక్ష విధించింది. శిక్ష అమలును 4 వారాలపాటు నిలిపివేసింది.

ఇవి కూడా చదవండి..

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లికి 4 లక్షల మంది.. ప్రధాని మోదీకీ ఆహ్వానం!

ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో యూపీ పట్టణం లోనీ

Updated Date - Nov 10 , 2026 | 05:23 AM