Share News

కరువు సన్నద్ధతపై నివేదికివ్వండి

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:47 AM

ఎల్‌నినో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది.

కరువు సన్నద్ధతపై నివేదికివ్వండి
hc

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది. ఎల్‌నినో ప్రభావంపై జిల్లాలు, రంగాలవారీగా శాస్త్రీయ అధ్యయనం చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ పిటిషన్‌పై గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శ్యామ్‌కోషీ, జస్టిస్‌ చలపతిరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదిస్తూ.. ఎల్‌నినో వల్ల హైదరాబాద్‌, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో తీవ్ర తాగునీటి కొరత ఏర్పడిందని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. తాగునీరు లేక వందలాది హాస్టళ్లు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించకపోవటం వల్ల తాగునీటి సమస్య మరింత పెరిగిందని ఆరోపించారు. కరువుపై జిల్లాలవారీగా ప్రత్యేకాధికారులను నియమించి, పర్యవేక్షణ చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఎల్‌నినో అనేది మనుషుల వల్ల ఏర్పడ్డ పరిస్థితి కాదు. దీనికి ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరికాదు. అయితే, ప్రభుత్వం నీటిని ఎక్కడి నుంచి ఎలా తెస్తుంది అనే అంశంతో మాకు పనిలేదు. ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉంచుతోందా లేదా ? అనేది మాత్రమే ముఖ్యం’ అని వ్యాఖ్యానించింది. ఎల్‌నినో, కరువు పరిస్థితులు, తాగునీరు తదితర అంశాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్‌ 9వ తేదీకివాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి..

మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు

Updated Date - Nov 13 , 2026 | 05:29 AM