వైద్య శాఖలో కొలువుల జాతర
ABN , Publish Date - Nov 10 , 2026 | 04:47 AM
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరోమారు కొలువుల జాతరకు సిద్ధమైంది. త్వరలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది.
2,929 పోస్టులుభర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు
ఇప్పటికే 996 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం
మిగిలిన వాటికి అంగీకారం లభించగానే ఉద్యోగ ప్రకటన
మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు నియామక బాధ్యతలు
చివరిదశలో 2,711 పోస్టుల భర్తీ ప్రక్రియ
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరోమారు కొలువుల జాతరకు సిద్ధమైంది. త్వరలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. ఈ మేరకు వైద్యశాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,929 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 996 పోస్టులకు ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతినివ్వగా, మిగిలిన 1,933 పోస్టులకు ఆమోదం లభించాల్సి ఉంది. త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. కాగా, ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతించిన 996 పోస్టుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 198, ఆయుష్ ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు 308, టెక్నీషియన్ పోస్టులు 290, బయోమెడికల్ ఇంజినీర్లు 14, ఫిజియోథెరపిస్టులు 46, రేడియోగ్రాఫర్లు 11, ల్యాబ్ టెక్నీషియన్లు 73, ఏఎన్‌ఎంలు 54 పోస్టులు ఉన్నాయి. వీటిని తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, వైద్య విద్య సంచాలకులు, ఆయుష్, ఎంఎన్‌జే, ఐపీఎం తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఆర్థికశాఖ అనుమతి రావాల్సి ఉన్న మరో 1,933 పోస్టుల్లో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 134 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, డీఎంఈ పరిధిలో 288 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 716 అసిస్టెంట్ ప్రొఫెసర్, 148 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 194 స్టాఫ్ నర్సు, 96 ల్యాబ్ టెక్నీషియన్, 119 జూనియర్ అసిస్టెంట్, 238 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులున్నాయి.
ఖాళీల వారీగా నోటిఫికేషన్లు
ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పోస్టులవారీగా ఖాళీలు, విభాగాల వారీగా అవసరాలను ఖరారు చేసి మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్లు జారీ చేయనుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకాలు మాత్రం టీపీఎస్సీ ఆధ్వర్యంలో జరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు వైద్య ఆరోగ్యశాఖలో 2,711 పోస్టుల భర్తీ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలోని ఎంపీహెచ్‌ఏ(ఫీమేల్) పోస్టుల భర్తీ దాదాపుగా పూర్తయ్యింది. త్వరలో తుది జాబితాను ప్రకటించనున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. మొత్తం 1931 ఎంపీహెచ్‌ఏ (ఫీమేల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫార్మాసిస్టు గ్రేడ్-2కు సంబంధించి 732 పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. సాంకేతిక కారణాలతో వీటి భర్తీలో జాప్యం చోటు చేసుకుంది. 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామక ప్రక్రియ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ 48 పోస్టులకుగాను 4 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి, వెయిటెజ్ మార్కులను చెక్ చేయడానికి ఎక్కువ సమయం పడుతున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాతవైద్యశాఖలో13,401 పోస్టులను భర్తీ చేసింది.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లికి 4 లక్షల మంది.. ప్రధాని మోదీకీ ఆహ్వానం!
ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో యూపీ పట్టణం లోనీ