Share News

మార్చిలో ఎమ్మెల్సీ సంగ్రామం

ABN , Publish Date - Aug 03 , 2026 | 05:58 AM

రాష్ట్రంలో మరోసారి ఎన్నికల భేరి మోగనుంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ...

మార్చిలో ఎమ్మెల్సీ సంగ్రామం

  • రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

  • సెప్టెంబరు చివరి వారంలో ఓటరు నమోదు నోటిఫికేషన్‌!

  • 2 స్థానాలనూ దక్కించుకునేలా హస్తం పార్టీ కసరత్తు

  • హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌పై బీజేపీ గురి

  • ఈసారి పోటీకి బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎమ్మెల్సీ అనాసక్తి

  • ‘వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం’లో బరిలోకి కొత్త వ్యక్తి?

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరోసారి ఎన్నికల భేరి మోగనుంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు కూడా మొదలుపెట్టాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం పట్టభద్రుల్లో.. మూడింట రెండొంతులకు పైగా ఈ రెండు శాసనమండలి నియోజకవర్గాల్లోనే ఉన్నారు. దీంతో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియ్‌సగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు సాధించి గెలిస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అదే పెద్ద సానుకూల అంశంగా మారుతుందని భావిస్తున్నాయి. మొత్తమ్మీద ఆరు ఉమ్మడి జిల్లాల్లో సుమారు 14 లక్షల మంది పట్టభద్రులు తీర్పు ఇచ్చే ఈ ఎన్నికలు.. ప్రధాన పార్టీల మధ్య మినీ మహాసంగ్రామమే కానుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఎన్నికల తీర్పు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపుతుందనీ చెబుతున్నాయి. కాగా, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణీదేవి, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తీన్మార్‌ మల్లన్న పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 27తో ముగియనుంది. దీంతో మార్చి 29 కల్లా ఈ స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీలు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు సెప్టెంబరు 20 నుంచి 30 తేదీల మధ్య ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. అక్టోబరు నుంచి డిసెంబరు 31 వరకు ఓటరు నమోదు ప్రక్రియను కొనసాగించి.. జనవరిలో అభ్యంతరాలు, సవరణ ప్రక్రియ చేపట్టవచ్చని పేర్కొంటున్నారు. అనంతరం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్‌ జారీ చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఎన్నికలు మార్చిలో జరిగినా.. ఓటరు నమోదు ప్రక్రియ అక్టోబరు నుంచే మొదలు కానుండటంతో క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ఇప్పటినుంచే సంసిద్ధమయ్యే ప్రయత్నాల్లో ఉన్నాయు.


అభ్యర్థిత్వం కోసం అధికార పార్టీలో పోటా పోటీ!

ప్రతిపక్షాలతో పోలిస్తే.. అధికార కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండటం ఆ పార్టీకి ప్రధాన సానుకూల అంశంగా మారింది. అలాగే రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం, మరో 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ల విడుదల ప్రక్రియ కొనసాగుతుండటంతో పట్టభద్రుల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత నెలకొని ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రతినెలా ఒకటో తారీకున వేతనాలు పడుతుండటంతో ఉద్యోగ వర్గాలు కూడా సర్కారు పట్ల సానుకూలంగానే ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పట్టభద్రులు ఈ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులకే మద్దతుగా నిలుస్తారని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇన్ని సానుకూలతల కారణంగానే రెండు స్థానాలకూ అభ్యర్థిత్వం కోసం పోటీ తీవ్రంగా ఉందని అంటున్నాయి. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి అభ్యర్థిత్వం కోసం ప్రధానంగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి, తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, పార్టీ నేత గౌరీ సతీశ్‌ తదితరులు పోటీ పడుతున్నారు. ఇక వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి, విజయా డెయిరీ మాజీ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఇందిర, ఓయూ జేఏసీ నేత లోకేశ్‌ యాదవ్‌ తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికకు త్వరలోనే కమిటీలు వేసి.. కసరత్తు ము మ్మరం చేసే పనిలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా సిట్టింగ్‌ స్థానమైన వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో అధికార పార్టీ ఉంది.


పోటీకి దూరంగా బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎమ్మెల్సీ..

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ సీటు అనే విషయం తెలిసిందే. అయితే ఇక్కడి సిటింగ్‌ ఎమ్మెల్సీ వాణీదేవి.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సీటును నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ నాయకత్వం ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేసింది. ఈ స్థానం నుంచి ఐఆర్‌ఎస్‌ అధికారి ఒకరిని బీఆర్‌ఎస్‌ తరపున పోటీకి దించే ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంకేతాలిచ్చారు. అలాగే శాప్‌ మాజీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత ఆంజనేయగౌడ్‌ తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన ఏనుగుల రాకేశ్‌రెడ్డినే మళ్లీ రంగంలోకి దించాలా? లేక కొత్త వ్యక్తిని దించాలా? అన్నదానిపై తర్జన భర్జన నడుస్తోంది. మరోవైపు వికలాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వాసుదేవరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. కాగా, 2023 నుంచి వరుస ఎన్నికల్లో ఓటమిపాలవుతూ వస్తున్న బీఆర్‌ఎస్‌కు ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకంగా మారాయి. ముఖ్యంగా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగేందుకు రెండు చోట్లా గట్టిపోటీ ఇవ్వక తప్పదన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 05:58 AM