Share News

‘విద్యుత్తు’పై సీబీఐ దర్యాప్తు

ABN , Publish Date - May 05 , 2026 | 04:03 AM

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ల నిర్మాణంపై జస్టిస్‌ మదన్‌ భీంరావు లోకూర్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

‘విద్యుత్తు’పై సీబీఐ దర్యాప్తు

  • ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌, యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్‌ల నిర్మాణంపై విచారణ కోరతాం

  • లోకూర్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగానే..

  • కాళేశ్వరంపైనా సీబీఐ విచారణ కోసం ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ

  • ఈ నెల 26న భూముల విలువల సవరణ

  • 10 శాతం చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పాత విలువతో హిల్ట్‌లో భూ మార్పిడి

  • స్కిల్‌ వర్సిటీ కిందకు ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు

  • క్యాబినెట్‌లో నిర్ణయాలు.. మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ల నిర్మాణంపై జస్టిస్‌ మదన్‌ భీంరావు లోకూర్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు కాళేశ్వరం బ్యారేజీలపై సీబీఐ విచారణకు పట్టుబట్టాలని, ఈ నెల 26 నుంచి భూముల మార్కెట్‌ విలువలను సవరించాలని, మదర్‌ డెయిరీని నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డుకు అప్పగించాలని, సబ్‌స్టేషన్ల వద్ద సోలార్‌ పవర్‌ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం తీర్మానాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి మీడియాకు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణను వేగవంతం చేయాలని సీబీఐని కోరుతూ ప్రభుత్వం తరఫున కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా రెండో పంట కొనుగోలుకు సంబంధించి వరి, మక్కలు పండించిన రైతులు ఎవరూ అభద్రతకు లోనుకావొద్దని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్క అడుగు కూడా వెనుకడుగు వేయకుండా కొనుగోలు చేస్తుందని చెప్పారు. చేతికొచ్చిన పంట కొనుగోలు జరగకపోవడంతో అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయడానికి వీలుగా ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలంలో ఇన్‌చార్జి మంత్రులు రంగంలోకి దిగుతారని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక రాష్ట్రంలో 2022లో ఫిబ్రవరిలో భూముల విలువలు సవరించారని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోల్చితే భారీగా హెచ్చుతగ్గులు ఉనట్లు గుర్తించామని మంత్రి పొంగులేటి అన్నారు. దాంతో శాస్త్రీయ నివేదిక ఆధారంగా భూముల విలువలను సవరించాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అర్వింద్‌ సుబ్రమణ్యన్‌ సూచనల ప్రకారం ఈ నెల 26లోపు జిల్లా కమిటీల నుంచి వివరాలు తెప్పించుకొని, అదే రోజు నుంచి భూముల విలువలు సవరించాలని నిర్ణయించామన్నారు. ఇక సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ కోసం భూములు సేకరించే క్రమంలో ప్రభుత్వం చెల్లించే ధరలు తక్కువగా ఉన్నాయని రైతులు/భూ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారని, భూముల విలువల సవరణ అనంతరం రైతాంగానికి/భూ యజమానులకు సముచితంగా పరిహారం దక్కుతుందని అన్నారు.


పాత భూముల విలువతో హిల్ట్‌ భూమార్పిడి

ఔటర్‌ రింగురోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను ఔటర్‌ అవతలికి తరలించి, ఆయా పరిశ్రమలు నిర్వహిస్తున్న భూములను పారిశ్రామికవేత్తలకే కట్టబెట్టడానికి వీలుగా హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ పాలసీ(హిల్ట్‌-2025) తెచ్చిన విషయం విదితమే. ఈ పాలసీ కింద ఈ నెలాఖరులోపు విలువలో 10 శాతం చెల్లించి, దరఖాస్తు చేసుకుంటే పాత భూముల విలువలతో భూమార్పిడికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10 శాతం ముందస్తుగా చెల్లించి, మిగిలిన 90 శాతాన్ని మూడు నెలల్లోపు కట్టడానికి ముందుకొస్తే పాత భూముల విలువతో భూమార్పిడికి అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని పొంగులేటి తెలిపారు. ఇక రంగారెడ్డి, నల్లగొండ రైతుల నుంచి పాలు సేకరించి, వాటి ఉత్పత్తులను విక్రయించేందుకు ఏర్పాటు చేసిన మదర్‌ డెయిరీని నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డు(ఎన్‌డీడీబీ) చేతికి అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించిందని పొంగులేటి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌ కాకుండా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 33/11 కే వీ లేదా ఇతర సబ్‌స్టేషన్ల వద్ద ఉన్న ప్రభుత్వ భూముల్లో మొత్తం 19 చోట్ల కలిపి రూ.66.50 కోట్లతో 20 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ వపర్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు దగ్గర ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ నిర్మాణానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)తో పాటు సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి కలిపి క్యూర్‌ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను కోసం వన్‌టైమ్‌సెటిల్మెంట్‌ను అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ మెట్రో వాటర్‌, సీవరేజీ బోర్డుకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రూ.5,864 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, వీటిలో వడ్డీ, పెనాల్టీలు ఉన్నాయని, వీటిని రద్దు చేసి, వాస్తవికంగా చెల్లించాల్సిన రూ.1686 కోట్లను వాటర్‌బోర్డుకు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఐఐటీ, పాలిటెక్నికల్‌, టీశాట్‌లను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ పరిధిలోకి తేవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో 42 ఎకరాల ప్రభుత్వ భూమిలో అధునాతన కూరగాయల మార్కెట్‌ నిర్మాణం కోసం భూమిని మార్కెటింగ్‌ శాఖకు ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయించిందన్నారు.


నిధుల సమీకరణపై చర్చ..

నిధుల సమీకరణపై క్యాబినెట్‌ భేటీలో సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది. వంద రోజుల్లో పింఛనుదారులకు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలు అన్ని చెల్లిస్తామని ప్రకటన చేసిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఆదాయవనరుల సమీకరణకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్‌ పథకానికి 25 శాతం రాయితీ ప్రకటిస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చిన అంశంపై చర్చించినట్లు, పెండింగ్‌లో ఉన్న 14 లక్షల దరఖాస్తులను క్లియర్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లకు చెల్లించాల్సిన రూ.55 వేల కోట్ల విద్యుత్తు బకాయిలకు సంబంధించి సబ్‌కమిటీ చర్చించి నివేదిక ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది. వీటితోపాటు మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లకుగాను కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతుధరపై మంత్రులు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చించి నిర్ణయం తీసుకుని నివేదిక ఇవ్వాలని క్యాబినెట్‌లో నిర్ణయించినట్లు సమాచారం.

‘హజ్‌’ అదనపు ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది: మంత్రి అజారుద్దీన్‌

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో హజ్‌ యాత్రపై అదనపు భారం పడనుంది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఇప్పటికే హజ్‌ కోసం ఎంపికైన వారికి అదనపు ఖర్చు కానుంది. దీంతో ఈ అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రం నుంచి హజ్‌కు వెళ్తున్న దాదాపు 7వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు.


విద్యుత్‌ కొనుగోళ్లపై జరిగింది ఇదీ..

బీఆర్‌ఎస్‌ హయాంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి జరిపిన విద్యుత్‌ కొనుగోళ్లపై కాంగ్రెస్‌ మొదటినుంచీ ఆరోపణలు చేస్తోంది. దీంతోపాటు కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టడం, బొగ్గు గనులకు దూరంగా యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మించడంపై 2024 మార్చి 14న జస్టిస్‌ నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్‌ వేసిన విషయం విదితమే. అయితే విచారణ పూర్తికాకముందే విచారణ అంశాలను వెల్లడించారంటూ మాజీ సీఎం కేసీఆర్‌ తదితరులు న్యాయస్థానానికి వెళ్లడంతో విచారణ నుంచి జస్టిస్‌ నర్సింహారెడ్డి వైదొలిగారు. అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌కు బాధ్యతలు అప్పగించగా.. ఆయన విచారణ పూర్తిచేసి, 2024 అక్టోబరులో నివేదిక సమర్పించారు. ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల కారణంగా నష్టం జరిగిందని నివేదికలో జస్టిస్‌ లోకూర్‌ పేర్కొన్నట్లు సమాచారం. ఆధునిక సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా కేవలం ఇండియా బుల్‌ సంస్థకు మేలు చేయడానికే సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో తయారు చేసిన పరికరాలతో భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ కట్టారని పేర్కొన్నట్లు తెలిసింది. ఇక యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం ఏకంగా బొగ్గు గనులకు 200 కిలోమీటర్ల దూరంలో జరిగిందని, వీటన్నింటికీ నాటి సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలే కారణమని నివేదికలో వెల్లడించినట్లు సమాచారం. 2025 జనవరి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై అడ్వకేట్‌ జనరల్‌తో న్యాయసలహా తీసుకొని సీబీఐ దర్యాప్తు కోరాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - May 05 , 2026 | 04:03 AM