Share News

రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించాలి

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:42 AM

తెలంగాణ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులకున్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ -2026ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించాలి
battivikramarka

  • పెట్టుబడుల అవకాశాలను చాటిచెప్పేలా గ్లోబల్‌ సమ్మిట్‌

  • మూడేళ్ల ప్రజా సంక్షేమం, అభివృద్ధి విజయాలకు ప్రాధాన్యం

  • అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులకున్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ -2026ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా నిలపాలని సూచించారు. రాష్ట్రంలో మూడేళ్లుగా ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ రంగాల్లో సాధించిన విజయాలు సదస్సులో ప్రతిబింబించాలన్నారు. అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రతినిధులకు తెలంగాణ ఆతిథ్య సంప్రదాయాలు, సంస్కృతి, ప్రత్యేకతలు చాటిచెప్పేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. గురువారం ప్రజాభవన్‌లోని ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ వార్‌ రూమ్‌’లో ప్రభుత్వ సీఎస్‌ సంజయ్‌ జాజు, సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సు ఏర్పాట్లపై శాఖలవారీగా పురోగతిని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సదస్సు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పురోగతిని మంత్రులందరికీ తెలియజేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు.


డేటా సెంటర్ల హబ్‌గా తెలంగాణ: భట్టి

దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణను ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో 5 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్తు సరఫరా, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. గురువారం ప్రజాభవన్‌లో డేటా సెంటర్ల నిర్వాహకులు, గ్రీన్‌ ఎనర్జీ రంగ ప్రతినిధులతో భట్టి సమావేశమయ్యారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంధన, ఐటీ, పరిశ్రమల శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని భట్టి తెలిపారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు దేశంలోని డేటా సెంటర్ల నిర్వాహకులు, పరిశ్రమల ప్రతినిధులు, గ్రీన్‌ ఎనర్జీ సంస్థలు హాజరుకావాలని ఆహ్వానించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 27 , 2026 | 05:47 AM