Share News

Telangana: ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పెంపునకు చర్యలు: పొన్నం

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:07 PM

భవిష్యత్ తరానికి మంచి జీవితాన్ని అందించడమే లక్ష్యంగా జీవో 41 ద్వారా ఈవీ పాలసీని తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో..

Telangana: ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పెంపునకు చర్యలు: పొన్నం
Telangana EV policy

హైదరాబాద్, జనవరి 6: భవిష్యత్ తరానికి మంచి జీవితాన్ని అందించడమే లక్ష్యంగా జీవో 41 ద్వారా ఈవీ పాలసీని తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈవీ పాలసీ, ఆర్టీసీకి సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. దీనిపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు.


గడిచిన సంవత్సర కాలంలో లక్ష ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయాయని మంత్రి తెలిపారు. ఈవీలు గతంలో ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్ వచ్చేదని.. ఇప్పుడు 500 కిలోమీటర్లు ప్రయాణించే కెపాసిటీ వాహనాలు వచ్చాయని వివరించారు. ఈ కెపాసిటీని మరింత పెంచడానికి సమీక్షలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. అలాగే ఛార్జింగ్ స్టేషన్‌లను పెంచానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి పొన్నం. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు, డీలర్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఈవీలు గణనీయంగా పెరిగాయన్నారు. రెడ్కో సంస్థల ద్వారా ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.


రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు, పాఠశాల బస్సులు, ఫార్మా, ఐటీ వాహనాలు 25- 50 శాతం వారి అవసరాలు బట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేలా విధానం తీసుకురాబోతున్నామని మంత్రి తెలిపారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే అక్కడ గాలిలో ప్రమాదకరమైన బ్యాక్టరీయా ఉన్నట్లు తెలుస్తుందన్న మంత్రి.. హైదరాబాద్‌లో డిల్లీ లాంటి ప్రమాదకర పరిస్థితి రాకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు, CNG, LPG వాహనాల వినియోగం పెంచుతున్నామన్నారు. పీఎం ఈ -డ్రైవ్ కింద 2,800 బస్సులు దశల వారీగా వస్తున్నాయని మంత్రి పొన్నం వెల్లడించారు.


వరంగల్ మున్సిపాలిటీకి 100, నిజామాబాద్ మున్సిపాలిటీ 50 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని మంత్రి పొన్నం ప్రకటించారు. అన్ని కలెక్టరేట్లలో, రెస్టారెంట్లలో, టూరిజం స్పాట్లలో ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగుండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. హైదరాబాద్‌లో 200 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాటుతుందని.. ఢిల్లీలో 400 దాటిందన్నారు. కాలుష్య నివారణకు ప్లాంటేషన్ పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే ఈవీల వినియోగం పెంచాలని.. దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్‌గా ఉండాలన్నారు. రాబోయే తరానికి కాలుష్య రహిత తెలంగాణ అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.


Also Read:

పరకామణి కేసులో పోలీసులకు హైకోర్టు షాక్

పూజలో ఈ తప్పులు చేస్తే ఫలితం ఉండదు.!

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..

Updated Date - Jan 06 , 2026 | 04:34 PM