Share News

టాపర్లు అబ్బాయిలు

ABN , Publish Date - May 18 , 2026 | 03:42 AM

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్‌-2026 ఫలితాల్లో టాపర్లలో ఎక్కువ మంది అబ్బాయిలు ఉండగా, మొత్తంగా ఫలితాల్లో అమ్మాయిలు పైచేయి సాధించారు.

టాపర్లు అబ్బాయిలు

  • ఎప్‌సెట్‌ టాప్‌ ర్యాంకర్లలో ఎక్కువ మంది బాలురే

  • ఇంజనీరింగ్‌లో మొదటి 10లో 8,అగ్రికల్చర్‌లో 7 ర్యాంకులు వారివే

  • మొత్తం ఫలితాలపరంగా చూస్తే మాత్రం అమ్మాయిలదే ఆధిపత్యం

  • ఇంజనీరింగ్‌, అగ్రి టాప్‌-10లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు

  • అగ్రికల్చర్‌లో 86.27 శాతం, ఇంజనీరింగ్‌లో 73.36శాతం అర్హత

  • ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కేశవరావు

హైదరాబాద్‌ సిటీ, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్‌-2026 ఫలితాల్లో టాపర్లలో ఎక్కువ మంది అబ్బాయిలు ఉండగా, మొత్తంగా ఫలితాల్లో అమ్మాయిలు పైచేయి సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో మొదటి 10 ర్యాంకుల్లో 8.. అగ్రికల్చర్‌, ఫార్మసీలో మొదటి 10 ర్యాంకుల్లో 7 అబ్బాయిలకే దక్కాయి. మొత్తంగా చూస్తే ఇంజనీరింగ్‌ విభాగంలో అమ్మాయిలు 73.72 శాతం అర్హత సాధించగా, అబ్బాయిలు 73.10 శాతం అర్హత సాధించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో అమ్మాయిలు 86.76 శాతం, అబ్బాయిలు 84.70 శాతం అర్హత సాధించారు. మొత్తంగా ఇంజనీరింగ్‌ విభాగంలో 73.36 శాతం, అగ్రికల్చర్‌లో 86.27 శాతం అర్హత సాధించారు. ఎప్‌సెట్‌ ఫలితాలను ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కంచర్ల కేశవరావు విడుదల చేశారు. ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షకు 84,954 మంది హాజరు కాగా, 73,294 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షను 1,97,242 మంది రాయగా, 1,44,704 మంది అర్హత సాధించారు. మొత్తంగా ఎప్‌సెట్‌ రాసినవారిలో ఈసారి 64,198 అర్హత సాధించలేకపోయారు.


2 విభాగాల్లోనూ హైదరాబాదీలకే ఫస్ట్‌ ర్యాంక్‌

ఈసారి ఎప్‌సెట్‌లో రెండు విభాగాల్లోనూ హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులకే మొదటి ర్యాంకులు దక్కాయి. ఇంజనీరింగ్‌ విభాగంలో ఉప్పల్‌కు చెందిన ఎం.రుషి మొదటి ర్యాంకు సాధించగా.. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో హుమాయిన్‌ నగర్‌కు చెందిన ముఖరం అహ్మద్‌ ప్రథమస్థానంలో నిలిచాడు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు విద్యార్థులు ఎప్‌సెట్‌లో టాప్‌ ర్యాంకులు సాధించారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్లపాటు ఏపీ అభ్యర్థులకు తెలంగాణలో, తెలంగాణ విద్యార్థులకు ఏపీలోని కాలేజీల్లో అడ్మిషన్లు లభించాయి. గత రెండేళ్లుగా రెండు రాష్ట్రాలు ఆ అవకాశాన్ని రద్దు చేశాయి. అయినా, ఏపీ విద్యార్థులుతెలంగాణ ఎప్‌సెట్‌ రాస్తున్నారు. ఈ ఏడాది ఇంజనీరింగ్‌ విభాగంలో 3, 4.. అగ్రికల్చర్‌లో 6, 7, 9 ర్యాంకులను ఏపీ అభ్యర్థులు సాధించారు. కాగా, ఎప్‌సెట్‌ ఫలితాలను పరీక్షలు ముగిసిన వారంలోపే విడుదల చేయడంపై విద్యార్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 11న పరీక్షలు ముగియగా, ఆరు రోజుల్లోనే ఫలితాలను విడుదలకు చర్యలు చేపట్టిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి, సెట్‌ కమిటీ చైర్మన్‌ టీకేకేరెడ్డి, కన్వీనర్‌ విజయకుమార్‌ రెడ్డిలను కేకే అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలకిష్టారెడ్డి, టీకేకేరెడ్డి, విజయకుమార్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సాంకేతిక విద్య కమిషనర్‌ శ్రీదేవసేన, జేఎన్టీయూ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు, ఎప్‌సెట్‌ కోకన్వీనర్‌ బాలు నాయక్‌ పాల్గొన్నారు. కాగా, ఖమ్మంకు చెందిన శిశిరి సాయి ఇంజనీరింగ్‌ విభాగంలో 39వ ర్యాంకు, బూర సాయిశరన్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీలో 8వ ర్యాంకు సాధించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఎం. సాత్విక్‌రెడ్డి ఎప్‌సెట్‌లో 50వ ర్యాంకు సాధించాడు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన సాయివర్ధన్‌ 63వ ర్యాంకు సాధించాడు.


ప్రణాళికతో చదివి ర్యాంకు సాధించా

ఏ పోటీ పరీక్ష అయినా టాపర్‌గా ఉండాలనే పట్టుదలతో చదవి ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాను. నా తల్లిదండ్రులు మల్లాది కొండల్‌రెడ్డి, శ్రీలతలు అందించిన ప్రోత్సాహం, కళాశాల అధ్యాపకుల సూచనలతో విజయం సాధించాను. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో ముందు నుంచి ఓ ప్రణాళిక ప్రకారం చదవడంతో పాటు పరీక్షలు రాయడంతో ఒకసారి చేసిన తప్పు, మరో సారి చేయకుండా చూసుకున్నాను.

- ఎం.రుషి, 1వ ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌)

ఐఐటీ బాంబేలో చదవటమే లక్ష్యం

ఐఐటీ బాంబేలో చదవటమే నా లక్ష్యం. నా తల్లిదండ్రులు, గురువులు అందించిన ప్రోత్సాహంతో ఎప్‌సెట్‌లో మంచి ర్యాంకు సాఽధించాను.

- అన్షుల్‌, 2వ ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌)

2.jpg

గురుకులంలో చదివి టాప్‌ ర్యాంకు సాధించా..

నేను గోషామహాల్‌లోని తెలంగాణ మైనార్టీస్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ స్టిట్యూషన్‌ సొసైటీ కాలేజీలో చదివాను. ఎప్‌సెట్‌ అగ్రికల్చర్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించినందుకు ఆనందంగా ఉంది. మా కళాశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే బాగా చదివి మొదటి ర్యాంకు సాధించాను.

- ముఖరం అహ్మద్‌, ఎప్‌సెట్‌ 1వ ర్యాంకర్‌ (అగ్రికల్చర్‌)

డాక్టర్‌ అవుతా

డాక్టర్‌ కావాలన్నది నా కల. ఇటీవల జరిగిన నీట్‌ పరీక్ష బాగా రాశాను. అది రద్దు కావటంతో మళ్లీ ప్రిపేర్‌ అవుతున్నా. ఎప్‌సెట్‌ కోసం ఎక్కువగా పాఠ్యపుస్తకాలే చదివాను.

- నివృత్‌సాయి, ఎప్‌సెట్‌ 2వ ర్యాంకర్‌ (అగ్రికల్చర్‌)

Updated Date - May 18 , 2026 | 06:20 AM