తెలంగాణ విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు చెక్.. కొత్త మార్గదర్శకాలు సిద్ధం
ABN , Publish Date - Nov 10 , 2026 | 07:49 PM
కాలేజీ క్యాంపస్‌లలో ఇక సినిమా ప్రమోషన్లు, ప్రైవేట్ ఈవెంట్లకు అనుమతి ఉండకపోవచ్చా? విద్యార్థుల భద్రత, విద్యా వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది.
హైదరాబాద్, నవంబర్ 10: ప్రైవేట్ కాలేజీల ఇష్టారాజ్యానికి కళ్లెం వేసేందుకు, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విద్యా సంస్థల క్యాంపస్‌లలో సినిమా ప్రమోషన్లు, ప్రైవేట్ ఈవెంట్ల నిర్వహణపై నిషేధం విధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. విద్యార్థులను రాజకీయ, వాణిజ్య కార్యక్రమాలకు ఉపయోగించడంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యా సంస్థల క్యాంపస్‌లను ఇకపై కేవలం విద్యా, క్రీడా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేయాలని యోచిస్తోంది. సినిమా చూడాలని విద్యార్థులకు ఏకంగా సెలవులు ప్రకటించిన కొన్ని ప్రైవేట్ కాలేజీల తీరుపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
అనుమతులు లేని అనధికారిక కార్యక్రమాల వల్ల విద్యా సంస్థల్లో తోపులాటలు, ప్రమాదాలు జరిగి విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వస్తుండటంపై రేవంత్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ప్రమోషన్ల పేరుతో విద్యార్థుల చదువును, క్రమశిక్షణను దెబ్బతీయడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.
ప్రతిపాదిత కొత్త మార్గదర్శకాలు
ముందస్తు అనుమతులు తప్పనిసరి: విద్యా సంస్థల్లో ఏదైనా భారీ ఈవెంట్ నిర్వహించాలంటే విద్యాశాఖతో పాటు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసే అవకాశం ఉంది.
భద్రతా నిబంధనలు: స్టేజీ నిర్మాణం, ఫైర్ సేఫ్టీ, విద్యార్థుల రక్షణకు సంబంధించి ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలు విధించనున్నారు. త్వరలోనే ఈ నూతన నియమావళితో కూడిన అధికారిక ఉత్తర్వులను విద్యాశాఖ విడుదల చేయనున్నట్టు సమాచారం.(Telangana College Movie Promotions Ban)
ఇవీ చదవండి:
మమతకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. 2013 ఘటనపై వాంగ్మూలం కోరిన పోలీసులు
హెగ్సెత్‌కు ట్రంప్ మద్దతు.. అభిశంసన ప్రయత్నాల వేళ కీలక వ్యాఖ్యలు