Share News

భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి: ఎమ్మెల్యే దానం నాగేందర్

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:22 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి, పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి: ఎమ్మెల్యే దానం నాగేందర్
Telangana Assembly News

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి, పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భాగంగా మాజీ మంత్రి, ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


నా సొంత భూమినే కంపెనీకి ఇచ్చారు..

ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ‘నా సొంత భూమిని కేటీఆర్ ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు. ఆ సమయంలో అధికారంలో ఉండటంతో నేను తీవ్రంగా నష్టపోయాను. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. అప్పుడు ఏమీ చేయలేక నోరు మూసుకోవాల్సి వచ్చింది. భూ బదలాయింపుల్లో జరిగిన అక్రమాలను వెలికితీయడానికి ప్రభుత్వం తక్షణమే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నా. ఈ అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలు, పత్రాలు నా వద్ద ఉన్నాయి. ప్రభుత్వం కోరితే వాటిని సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను వ్యక్తిగతంగా ఎంత నష్టపోయానో నాకు మాత్రమే తెలుసు. ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది.


రూ. 200 కోట్ల విలువైన భూమి కబ్జా చేశారు..

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘హన్మకొండలో సుమారు రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పేరుతో అక్రమంగా దక్కించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట. నా ఆరోపణలు నిరూపించకుంటే 48 గంటల్లో పదవికి రాజీనామా చేస్తా. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ భూ దోపిడీపై హౌస్ కమిటీ వేయాలి. అక్రమంగా నిర్మించిన పార్టీ కార్యాలయాల విషయంలో కఠినంగా వ్యవహరించి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలి’ అని అన్నారు.


లక్షల ఎకరాలు దోచుకున్నారు..

తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత పదేళ్ల కాలంలో జరిగిన భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగాయి. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను దోచుకున్నారు. ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కంపెనీల యజమానులను బెదిరించారు. వారి వద్ద ఉన్న విలువైన భూములను బలవంతంగా బదలాయించుకున్నారు. ఇదో వ్యవస్థీకృత దోపిడీ.. బాలానగర్ ప్రాంతంలో జరిగిన భూ అక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ నిరసన..

Updated Date - Mar 29 , 2026 | 12:46 PM