Share News

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం.. రూ.20 వేల కోట్ల ప్యాకేజీ డిమాండ్

ABN , Publish Date - Sep 18 , 2026 | 09:08 PM

ఎల్‌నినో తీవ్ర ప్రభావంపై తెలంగాణ శాసనసభ ఆందోళన వ్యక్తం చేసింది. సవాళ్లను అధిగమించడానికి కేంద్రం సహాయం అందించాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తీర్మానాలకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం.. రూ.20 వేల కోట్ల ప్యాకేజీ డిమాండ్
El Nino: Telangana Assembly Approves Bhatti Resolution Unanimously

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ శాసనసభలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం, కరువు పరిస్థితులపై శాసనసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయం అందించాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తీర్మానాలకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

తీర్మానంలోని ముఖ్యమైన డిమాండ్లు ఇవే..

కేంద్ర బృందం పర్యటన: రాష్ట్రంలో ఎల్‌నినో సృష్టించిన నష్టాలు, తీవ్రతను నేరుగా అంచనా వేయడానికి తక్షణమే ఒక కేంద్ర బృందాన్ని తెలంగాణకు పంపాలి.

రూ. 20,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ: ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు, పునర్నిర్మాణ చర్యల కోసం తెలంగాణకు రూ. 20 వేల కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీని మంజూరు చేయాలి.

సహాయ నిధుల విడుదల: జాతీయ విపత్తు స్పందన నిధి (NDRF) నుంచి తగిన ఆర్థిక సాయం అందించడంతో పాటు, రాష్ట్ర విపత్తు స్పందన నిధి (SDRF) లో రావాల్సిన కేంద్ర వాటాను తక్షణమే విడుదల చేయాలి.

ఉపాధి హామీ రోజుల పెంపు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద ప్రస్తుతం ఇస్తున్న 125 రోజులకు అదనంగా మరో 50 రోజుల ఉపాధిని కల్పించాలి. ఈ అదనపు 50 రోజుల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరించాలి.

విద్యుత్, బొగ్గు కేటాయింపులు: రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అదనంగా 1,500 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయించాలి. అలాగే రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 5 మిలియన్ టన్నుల బొగ్గు లింకేజీని కల్పించాలి.

FRBM పరిమితి పెంపు: రాష్ట్ర ఆర్థిక సామర్థ్యాన్ని, వ్యయాన్ని పెంపొందించుకోవడానికి ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ (FRBM) రుణ పరిమితిని 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలి.

రైతులు, తాగునీటి రక్షణ: ఉపాధి, తాగునీరు, పశుగ్రాసం సరఫరా, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల మట్టాన్ని పెంచే చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అదనపు ఆర్థిక సాయాన్ని అందించాలి.


ఈ వార్తలను చదవండి:

ఒకటి కాదు, రెండు కాదు.. గంటలో 106 సమోసాలు.. వీడియో వైరల్

బంగారం అమ్మేసి భార్యకు ఐఫోన్ 18 ప్రో గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైన భర్త!

Updated Date - Sep 18 , 2026 | 09:23 PM