Share News

బిల్లులు చెల్లించడానికి 39.14 లక్షలు లంచం

ABN , Publish Date - Oct 23 , 2026 | 04:47 AM

ప్రధాన మంత్రి కిసాన్‌ సమృద్ధి యోజన (పీఎంకేఎస్‌వై) పథకాన్ని అమలు చేసే ఇద్దరు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు.

బిల్లులు చెల్లించడానికి 39.14 లక్షలు లంచం
employees

  • బిల్లులో 25శాతం యూపీఐ ద్వారా వసూలు

  • భూపాలపల్లి జిల్లాలో పీఎంకేఎస్‌వై అధికారుల తీరు

  • ఏసీబీకి కాంట్రాక్టర్ ఫిర్యాదు

  • లంచం తీసుకున్నట్టు నిర్ధారించిన అధికారులు

  • ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీశ్‌రెడ్డి, ఉద్యోగి రాజు అరెస్టు

హైదరాబాద్‌/భూపాలపల్లి కలెక్టరేట్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి కిసాన్‌ సమృద్ధి యోజన (పీఎంకేఎస్‌వై) పథకాన్ని అమలు చేసే ఇద్దరు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం 10శాతం నుంచి 25శాతం వరకు లంచాలు వసూలు చేస్తూ.. భూపాలపల్లి జిల్లా భగీరథిపేట ప్రాజెక్టుకు చెందిన ప్రాజెక్టు ఆఫీసర్‌ (పీవో) సతీశ్‌రెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ రాజు ఏసీబీ అధికారులకు చిక్కారు. వారిని అరెస్టుచేశామని, శుక్రవారం వరంగల్‌ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు.పీఎంకేఎస్‌వై 2.0 పథకం కింద భూగర్భ జలాల పెంపు కోసం భూపాలపల్లి జిల్లాలోని రేగొండ, మల్హర్‌, పలిమెల మండలాలను ప్రభుత్వం గుర్తించింది. రేగొండ మండలంలోని భగీరథిపేట, గూడేపల్లి, మడతపల్లి, నారాయణపూర్‌, దుంపిళ్లపల్లిలో కందకాలు, రాక్‌ఫిల్‌ డ్యామ్స్‌, ఆనకట్టలు, ఊటకుంటలు, సేద్యపు గుంతలు తదితరపనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. రేగొండ మండలంలో రూ.5 కోట్లతో నలుగురు కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేశారు. ప్రాజెక్టు ఆఫీసర్‌ సతీశ్‌రెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ రాజు కలిసి ఆ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం 10శాతం నుంచి 25శాతం వరకు లంచం డిమాండ్‌ చేశారు. ఒక కాంట్రాక్టర్‌ నుంచి రూ.39.14లక్షలు యూపీఐ ద్వారా వసూలు చేశారు.


మరో రూ.1.34కోట్ల బిల్లు చెల్లింపు కోసం 25శాతం ముడుపుగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వారితీరుపై విసిగిపోయిన కాంట్రాక్టరు ఏసీబీని ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 14వ తేదీనే కేసు నమోదు చేసిన అధికారులు.. లోతుగా దర్యాప్తు చేసి, లంచం వసూళ్లను నిర్ధారించుకున్నారు. గురువారం భూపాలపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో తనిఖీలు చేసి, పలురికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సతీశ్‌రెడ్డి, రాజులను అరెస్టు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?

భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!

Updated Date - Oct 23 , 2026 | 04:58 AM