టైబ్యునల్‌లోనే తేల్చుకోండి
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:21 AM
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పరిధిలో డీ సిల్టేషన్ పేరుతో చేపడుతున్న ఇసుక తవ్వకాల అంశాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)లోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది
సీతమ్మ సాగర్ ఇసుక తవ్వకాలపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
ట్రైబ్యునల్ విధించిన స్టేపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పరిధిలో డీ సిల్టేషన్ పేరుతో చేపడుతున్న ఇసుక తవ్వకాల అంశాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)లోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ విధించిన స్టే వ్యవహారంపై కలుగజేసుకోవడానికి నిరాకరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలో సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ములుగు జిల్లాలో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ముంపునకు గురవుతున్నది. ఈ ప్రాంతంలో గోదావరి నుంచి ఇసుకను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే, ఇది పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ పూనెం రాములు సహా మరికొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం, టీజీఎండీసీ, ములుగు కలెక్టర్ సహా ఇతరులకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. అప్పటి వరకూ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశిస్తూ మధ్యంతర స్టే విధించింది. ఎన్జీటీ ఉత్తర్వులను ఈనెల 1న తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్( టీజీఎఎస్ఎండీసీ)సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్ సీజేఐ, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఎన్జీటీలో తదుపరి విచారణ నవంబరు 5వ తేదీన విచారణకు రానున్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. వ్యవహారాన్ని ట్రైబ్యునల్‌లోనే తేల్చుకోవాలని చెబుతూ, టీజీఎఎస్ఎండీసీ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్