Share News

రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను 23లోగా రిజిస్ట్రేషన్‌చేయండి

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:09 AM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన రాజీవ్‌ స్వగృహ లబ్ధిదారులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కల్పించింది.

రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను   23లోగా రిజిస్ట్రేషన్‌చేయండి
SUPREMECOURT

  • కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ ఫ్లాట్లపై

  • తెలంగాణ హౌసింగ్‌ బోర్డుకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన రాజీవ్‌ స్వగృహ లబ్ధిదారులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కల్పించింది. అర్హులైన కొనుగోలుదారులందరికీ ఈ నెల 23వ తేదీలోగా సేల్‌డీడ్‌ (రిజిస్ట్రేషన్‌) ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ హౌసింగ్‌ బోర్డును ఆదేశించింది. అయితే.. కేసు తుది విచారణ ముగిసేవరకూ కొనుగోలుదారులెవరూ క్రయ విక్రయాలు, బదిలీలు చేయరాదని షరతు విధించింది. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను కొందరు కొనుగోలు చేయగా.. వాటి అప్పగింతలో హౌసింగ్‌ బోర్డు తీవ్ర జాప్యం చేయడంతో వివాదం తలెత్తింది. కాగా, ఫ్లాట్ల అప్పగింతలో జరిగిన జాప్యానికిగాను కొనుగోలుదారులకు వడ్డీ రూపంలో సుమారు రూ.16.66 లక్షల చొప్పున చెల్లించాలని సుప్రీంకోర్టు 2023 మే నెలలో ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఫ్లాట్‌ తుది విక్రయ ధరలో సర్దుబాటు (మినహాయింపు) చేయాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2025 జూన్‌ 19న జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ (ఎన్‌డీఆర్‌సీ) సైతం కొనుగోలుదారులకు అనుకూలంగానే ఉత్తర్వులు జారీ చేసింది.


అయితే ఎన్‌డీఆర్‌సీ తీర్పును తెలంగాణ హౌసింగ్‌ బోర్డు హైకోర్టులో సవాల్‌ చేసింది. కొనుగోలుదారులు పూర్తి విక్రయ ధర రూ.47.85 లక్షలతోపాటు వాయిదాల చెల్లింపులో జాప్యం చేసినందుకు 14 శాతం అపరాధ వడ్డీ చెలిస్తేనే ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌ చేస్తామని బోర్డు మెలిక పెట్టింది. కానీ, తమకు రావాల్సిన రూ.16.66 లక్షల వడ్డీ పోను.. ఇంకా రూ.4.61 లక్షలు బోర్డు నుంచి తమకే వస్తాయని కొనుగోలుదారులు వాదించారు. వాదనల తర్వాత.. పెనాల్టీలు, అడ్జ్‌స్టమెంట్ల అంశాలన్నీ పక్కనబెట్టి 10రోజుల్లోగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును హౌసింగ్‌ బోర్డు మరోసారి సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. 111 మందిని ప్రతివాదులుగా చేర్చింది. ఆ పిటిషన్‌ శుక్రవారం ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.

ఇవి కూాడా చదవండి...

శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్‌’తో సమస్యకు చెక్

ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.

Updated Date - Nov 07 , 2026 | 06:10 AM