Share News

మూఢ నమ్మకాలు, భయానికి నలుగురి బలి

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:44 AM

మూఢ విశ్వాసాలకు ఇద్దరు వృద్ధులు దారుణ హత్యకు గురవ్వగా, తమనూ వదిలిపెట్టరన్న భయంతో ఇద్దరు దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

మూఢ నమ్మకాలు, భయానికి నలుగురి బలి
moodanammakalu

  • చేతబడులు చేస్తున్నారని ఇద్దరు వృద్ధుల హత్య

  • తమనూ వదలరనే భయంతో దంపతుల ఆత్మహత్య

  • కొత్తగూడెం జిల్లా ఆదివాసీ గ్రామం బుడుగులలో ఘటన

మణుగూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మూఢ విశ్వాసాలకు ఇద్దరు వృద్ధులు దారుణ హత్యకు గురవ్వగా, తమనూ వదిలిపెట్టరన్న భయంతో ఇద్దరు దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఆదివాసీ గ్రామమైన బుడుగులలో జరిగింది. గ్రామానికి చెందిన పద్దం రాంబాబు (30), సునీత (25) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఏడాదిన్నర వయసుగల చిన్న కుమార్తె తరచూ అనారోగ్యంతో బాధపడుతోంది. పాపకు ఏదైనా చెడుపు జరిగిందేమోనని భావించి నివారణ పూజల కోసం రాంబాబు తండ్రి అయిన పద్ద మాసయ్య (68), ఆళ్లపల్లి మండలం బుసిరాయి గ్రామ వాస్తవ్యుడు, రాంబాబుకువరుసకు మామయ్య అయిన భీమయ్య (68)ను పిలిపించారు. పూజలు చేశాక మాసయ్య, భీమయ్య బుసిరాయి గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో వారిని బుడుగుల గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. చేతబడి చేస్తున్నారని ఆరోపిస్తూ ఇద్దరినీ చంపేసి అటవీ ప్రాంతంలోనే ఓ చోట పూడ్చేశారు. నెల తర్వాత ఈ జంట హత్యల ఘటన వెలుగులోకొచ్చింది. 10న నిందితులను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాలను వెలికితీసి కుటుంబసభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి.


అయితే ఆ ఇద్దరు వృద్ధులను చంపేసినట్లుగానే తమనూ చంపుతారేమోనని సునీత భయపడింది. ‘మనం ఇక్కడ ఉండొద్దు. లేదంటే మామ (మాసయ్య)ను చంపినట్లే మనల్నీ చంపుతారు. చత్తీస్ గఢ్ వెళ్లిపోదాం’ అని రాంబాబుపై ఒత్తిడి తెచ్చింది. ఆమె ప్రతిపాదనకు రాంబాబు ఒప్పుకోలేదు. ఈ విషయమ్మీద బుధవారం రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భర్త తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీత గురువారం ఉదయం పత్తి పంట కోసం తెచ్చిన పురుగుల మందు తాగి చనిపోయింది. భార్య మృతితో ఆవేదన చెందిన రాంబాబు అదే పురుగుల మందు తాగి అడవిలోకి పరుగు తీశాడు. వెంబడించి పట్టుకున్న స్థానికులు అతడిని తొలుత మణుగూరు ఆస్పత్రికి, అక్కడి నుంచి భద్రాచలం తీసుకెళుతుండగా మృతిచెందాడు. దంపతుల మృతితో వారి ఇద్దరు బిడ్డలే అనాథలయ్యారు. కాగా మూఢనమ్మకాల నుంచి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు, కళాజాత బృందాల ద్వారా గురువారం రాత్రి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి..

మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు

Updated Date - Nov 13 , 2026 | 02:47 AM