డేటింగ్ సైట్లకు దీటుగా.. పెరిగిపోతున్న షుగర్ డాడీ, మమ్మీ, బేబీలు..
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:58 AM
షుగర్ డాడీ.. ఈ పదం చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. కానీ, సంపన్న వర్గాల్లో.. మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో, పలు కంపెనీలలో ఉన్నత స్ధాయిలో ఉన్న ఉద్యోగుల నడుమ వాడుకలో ఉన్న పదమే. పైన పేర్కొన్న రెండు సందర్భాల్లోని ఎండీ, సీఈవో.. ఇద్దరూ షుగర్ డాడీలే! వారి వద్ద ఉన్నది..
హైదరాబాద్‌లో పెరుగుతున్న షుగర్ డాడీ, మమ్మీ, బేబీలు
కెరీర్‌లో ఎదుగుదల, జల్సా లైఫ్ కోసం అలాంటి వారిని ఆశ్రయిస్తున్న కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు
రాజధానిలో 11 వేల మందికి పైగా షుగర్ డాడీలు!
వారిలో వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈవోలు, ఎండీలు
ఈ బంధాలతో మానసిక సమస్యలు: సైకాలజిస్ట్‌లు
రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఒక సుప్రసిద్ధ షోకి.. పలు సంస్థల సీఈవోలు, ఉన్నతాధికారులూ దానికి వచ్చారు. వచ్చిన వారిలో ఒక కంపెనీ సీఈవో మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి కారణం.. ఆయనతోపాటు వచ్చిన ఒక అందమైన అమ్మాయి. ఆమె ఆయన భార్య కాదు. కుమార్తె కాదు. వ్యక్తిగత సహాయకురాలు అంతకంటే కాదు. మరెవరు?
ఒకమ్మాయికి మూడు నెలల క్రితం పెళ్లయింది. భర్త ఆమెకు.. తాను చేస్తున్న కంపెనీలోనే మంచి ఉద్యోగం చూశాడు. కానీ, ఆమె అందులో చేరడానికి ఒప్పుకోలేదు. పెళ్లికి ముందు తనకు మెంటార్‌గా ఓ కంపెనీ ఎండీ ఉన్నాడని.. అతని దగ్గరే ఉద్యోగంలో చేరుతానని పట్టుపట్టింది. ‘ఎందుకింత పట్టుదల?’ అని ఆరా తీసిన అతను.. ఇటీవలే విడాకులకు దరఖాస్తు చేశాడు. కారణం ఏమిటి?
షుగర్ డాడీ.. ఈ పదం చాలా మందికి కొత్తగా అనిపించవచ్చు. కానీ, సంపన్న వర్గాల్లో.. మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో, పలు కంపెనీలలో ఉన్నత స్ధాయిలో ఉన్న ఉద్యోగుల నడుమ వాడుకలో ఉన్న పదమే. పైన పేర్కొన్న రెండు సందర్భాల్లోని ఎండీ, సీఈవో.. ఇద్దరూ షుగర్ డాడీలే! వారి వద్ద ఉన్నది.. సామాజిక స్థాయి, డబ్బు. ఆ అమ్మాయిలకు కావాల్సింది కెరీర్‌లో ఎదగడం, జీవనశైలి అవసరాలు తీర్చుకోవడం. నీకది.. నాకిది కాన్సెప్టులో సాగిపోయే వ్యవహారమిది! ఆ సీఈవో, ఎండీ స్థానంలో మహిళలు ఉంటే.. వారిని షుగర్ మమ్మీలుగా వ్యవహరిస్తారు. సామాజిక మాధ్యమాలలో ఫిల్టర్ల మాటున.. హైఫై క్లబ్బులు, పబ్బుల మసక చీకట్లలో.. ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీల సంస్కృతి బాగా పెరుగుతోంది. వారిని ఉపయోగించుకుని కెరీర్‌లో ఎదగాలనుకునే, విలాసవంతమైన జీవితం గడపాలనుకునే అమ్మాయిలు, అబ్బాయిలను షుగర్ బేబీస్ అంటారు! కాలేజీ అమ్మాయిలు/అబ్బాయిలు, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చినవారు, హాస్టళ్లలో ఒంటరిగా ఉంటూ ఉద్యోగాలు చేసుకునేవారు షుగర్ బేబీలుగా మారుతుంటే.. ఉద్యోగ/వృత్తి జీవితంలో, వ్యాపారంలో ఉన్నత స్థానాలకు ఎదిగి ఐదు పదుల వయసుకు దగ్గర్లో ఉన్న స్త్రీ, పురుషులు షుగర్ డాడీలు, షుగర్ మమ్మీలుగా చలామణి అవుతున్నారు. వీరిలో ఒకరిది కోరిక అయితే.. మరొకరిది అవసరం. యవ్వనంలో ఉన్న అమ్మాయిలు/అబ్బాయిలకు ఆర్ధిక భరోసా, అవసరమైన మెంటార్‌షిప్ అందిస్తూనే సాహచర్యం, లేదంటే రొమాన్స్‌ను ఆశించే షుగర్ డాడీ/మమ్మీల కాన్సెప్ట్.. నిజానికి విదేశాల్లో చాలాకాలం నుంచే ఉంది. మన దేశంలో మాత్రం ఇటీవలి కాలంలో చాలామంది నిజమైన సంబంధాల కంటే ఆర్థిక భద్రతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుండటంతో ఆ సంస్కృతి ఇక్కడా వేగంగా వ్యాపిస్తోందని సోషియాలజిస్ట్‌లు చెబుతున్నారు.
డేటింగ్ సైట్లకు దీటుగా..
‘షుగర్’ కోటింగ్ అద్దుకున్న ఈ తరహా బంధాలు ప్రస్తుతం మూడు కంపెనీలు, ఆరు హాస్టళ్లుగా వెలిగిపోతున్నాయి. డేటింగ్ సైట్లకు ధీటుగా ఈ ‘షుగర్’ సైట్లూ పెద్ద ఎత్తున చందాదారులతో దూసుకుపోతున్నాయి. మల్టీమిలియనీర్లకు మాత్రమే ‘షుగర్’ డాడీలుగా మారే అవకాశమున్నప్పటికీ హైదరాబాద్‌లో 11వేల మందికిపైగా వ్యక్తులు ‘షుగర్’ డాడీలుగా తమ వేదికపై నమోదు చేసుకున్నారని ఓ సైట్ నిర్వాహకులు పేర్కొనడం గమనార్హం. డాడీలే కాదు.. ‘షుగర్’ మమ్మీలకూ కొదవలేదిక్కడ. పబ్‌లు, క్లబ్‌లలో పార్టీలలో ఈ మమ్మీలదే హవా అని ఈ తరహా బంధాలను దగ్గరగా చూసినవారు చెబుతున్నారు. ఇందులో భావోద్వేగాలకు ఎలాంటి తావూ ఉండదు. ‘నాకు ఏం కావాలి? ఏం ఆశిస్తున్నాను.. మీకు ఏం కావాలి? ఏం ఆశిస్తున్నారు?’ అనే విషయాలను ముందుగానే ఓ బిజినెస్ కాంట్రాక్టులా మాట్లాడుకుంటారు! కుదిరితే ముందుకెళ్తారు. లేదంటే అక్కడితో కట్. ఇలాంటి పోకడలు ఇండియాలో ముంబై తరువాత హైదరాబాద్‌లోనే ఎక్కువ అని సమాచారం.
కొవిడ్ కాలంలో మొదలు..
కొవిడ్ విపత్తు సమయం మన జీవితాల్లో చాలా మార్పులను తీసుకొచ్చింది. ఎంతో మంది ప్రాణాలు, మరెంతోమంది ఉపాధినీ కోల్పోయారు. బంధాలూ విచ్ఛిన్నమయ్యాయి. అన్ని బంధాలూ ఆర్థిక బంధాలేనన్న నిస్పృహ కూడా కలిగించిన కాలమదే! దీంతో ఆ సమయంలో డేటింగ్ యాప్‌ల సబ్‌స్క్రైబర్ల సంఖ్య అమాంతంగా పెరిగింది! కెరీర్ వృద్ధి అవకాశాలను అన్వేషించుకుంటూ కొత్తతరహా బంధాల కోసం చూస్తున్నవారికి ఆ సమయంలో కనిపించిందే ఈ షుగర్ మమ్మీ, డాడీ సంస్కృతి! కారణాలేవైనాగానీ.. తీపి కోటింగ్ పులుముకున్న ఈ తరహా బంధాల మాటున చేదును గుర్తించలేక పోవడం నవతరపు అవివేకం లేదంటే, వ్యక్తి త్వం పేరిట చూపుతున్న విచ్ఛలవిడితనంగానే పరిగణించాలని సామాజిక శాస్త్రవేత్తలు (సోషియాలజిస్టులు)అభిప్రాయపడుతున్నారు. ‘‘మనకంటూ కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. వాటికి కట్టుబడే సమాజం మనది. ఆర్థిక సౌకర్యాల కోసమో, ఎదుగదల కోసమో ఈ తరహా బంధాలు ఏర్పరుచుకోవడం వల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలు రావొచ్చు. పాశ్చాత్య సంప్రదాయాలలో మంచిని తీసుకోవడానికి ఇష్టపడని నవతరం, ఇలాంటి ధోరణులను అనుసరించడం వల్ల న్యాయపరమైన సమస్యలూ పెరుగుతాయి. ఈ బంధాలు విచ్ఛిన్నమైతే తప్పుడు ఆరోపణలు కూడా పెరుగుతాయి. అమెరికా లాంటి చోట్ల ఈ తరహా కేసులను మనం తరచూ చూస్తుంటాం’’ అని ఒక కాలేజీలో సోషియాలజీ లెక్చరర్‌గా పనిచేస్తున్న రాగిణి తెలిపారు. ఇక.. ఈ తరహా సంబంధాలు మొదట్లో ఉత్తేజాన్నిచ్చి నా.. కాలక్రమంలో మానసిక సమస్యలకు కారణమవుతాయని మనస్తత్వశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. బాగా డబ్బు, పరపతి ఉన్న వ్యక్తులు ఒకరితో సరిపెట్టుకోరని.. అప్పుడు వారిపై ఆధారపడి విలాసానికి అలవాటుపడిన అమ్మాయిలు, అబ్బాయిల్లో ఆందోళన, అభద్రతా భావం పెరుగుతాయంటున్నారు. ‘‘ఈ బంధాలు మానసిక ఆరోగ్యంపరంగా ఏ మాత్రం శ్రేయస్కరం కాదు’’ అని హెచ్చరిస్తున్నారు!!
- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ