Share News

మరొకటి ఇస్తారా?

ABN , Publish Date - Jul 03 , 2026 | 07:07 AM

సర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియలో భాగంగా ఓటరు వివరాల నమోదుకోసం క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఎన్యుమరేషన్‌ పత్రాలను భారత ఎన్నికల సంఘం బూత్‌ స్థాయి అధికారుల (బీఎంల్‌వో) ద్వారా పౌరులకు...

మరొకటి ఇస్తారా?

వివరాలు తప్పుగా రాస్తే ఏం చేయాలి?.. కొట్టివేసి అదే పత్రంలో మళ్లీ రాయొచ్చా?

  • ప్రజల్లో అనుమానాలకు ఇవీ సమాధానాలు

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): సర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియలో భాగంగా ఓటరు వివరాల నమోదుకోసం క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఎన్యుమరేషన్‌ పత్రాలను భారత ఎన్నికల సంఘం బూత్‌ స్థాయి అధికారుల (బీఎంల్‌వో) ద్వారా పౌరులకు అందజేస్తోంది. మరి.. అందులో వివరాలను తప్పుగా నమోదు చేస్తే ఎలా? బీఎల్‌వోలు ఇచ్చిన ఫారం ఉపయోగపడే స్థితిలో లేకుండా చిరిగిపోయినా.. ఇంకా ఏమైనా జరిగితే ఏం చేయాలన్న దానిపై ప్రజల్లో సందేహాలున్నాయి. అంతే కాకుండా ఎన్యుమరేషన్‌ ఫారాల్లో వివరాల నమోదు సమగ్రంగా చేపట్టలేని స్థితిలో ఉన్నామంటూ గ్రామీణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో తలెత్తే అనుమానాలపై ప్రశ్నలు.. వాటిని సమాధానలు!

ఎన్యుమరేషన్‌ పత్రంలో వివరాలు తప్పుగా నమోదు చేస్తే మరో పత్రం ఇస్తారా?

ఇస్తారు. పత్రం పూర్తిగా తప్పుగా నింపినా, పేజీ చిరిగిపోయినా లేదంటే ఉపయోగించలేని స్థితిలో ఉన్నా, బీఎల్‌వోలు అవసరాన్ని బట్టి మరో పత్రాన్ని అందించవచ్చు. అయితే అవసరం లేకుండా పదేపదే కొత్త పత్రాలు మాత్రం ఇవ్వరు

పత్రం స్వీకరించిన తర్వాత తప్పు గుర్తిస్తే ఏం చేయాలి?

సాధ్యమైనంత త్వరగా సంబంధిత బీఎల్‌వో లేదంటే ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించి విషయం తెలియజేయాలి. పరిశీలన దశలో ఉంటే అవసరమైన సవరణలు చేయడానికి అధికారులు సూచించే ప్రక్రియను అనుసరించాలి

మరో పత్రంలోనూ మునుపటి క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందా?

ఎన్యుమరేషన్‌ పత్రాలపై ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌ ప్రతి పత్రాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఒక పత్రం దెబ్బతిన్నా లేదంటే తప్పుగా వివరాలు నమోదు చేసినా ఎన్నికల అధికారులు తమ విధివిధానాల ప్రకారం మరో పత్రాన్ని జారీ చేయవచ్చు. అవసరమైతే సంబంధిత క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ప్రత్యామ్నాయ పత్రాన్నే అందించవచ్చు. ఇది ఎన్నికల సంఘం అమలు చేస్తున్న స్థానిక పరిపాలనా విధానాలపై ఆధారపడి ఉంటుంది.

తప్పుగా నింపిన పత్రంలో కొట్టివేసి మళ్లీ వివరాలను భర్తీ చేయొచ్చా?

చిన్న చిన్న దిద్దుబాట్లు మాత్రమే ఉంటే బీఎల్‌వో సూచన మేరకు సరిచేయొచ్చు. కానీ ముఖ్యమైన వివరాలు పూర్తిగా తప్పుగా నమోదైతే కొత్త పత్రాన్ని ఉపయోగించడం ఉత్తమం.


వివరాల నమోదులో బీఎల్‌వోలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలేవి?

వివరాల నమోదులో బీఎల్‌వోలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో... ఓటర్లు పూర్తి వివరాలు ఇవ్వకపోవడం. ఆధార్‌, జనన ధ్రువీకరణ, చిరునామా పత్రాలు అందుబాటులో లేకపోవడం., పేర్లు, వయస్సు, బంధుత్వ వివరాల్లో తేడాలు ఉండటం వంటివి ఉన్నాయి. అలాగే ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల పత్రం ఇవ్వలేకపోవడం., ఒకే కుటుంబంలో వేర్వేరు చిరునామాలు చెప్పడం, పత్రం ఎలా నింపాలో తెలియక ఓటర్లు పొరపాట్లు చేయడం, ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓటు ఉండటం వంటి అంశాలు బీఎల్‌వోలను ఇబ్బంది పెడుతున్నాయి. బీఎల్‌వోలకు ఏవైనా సందేహాలు ఉన్నప్పుడు సంబంధిత ఎన్నికల నమోదు అధికారిని (ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ) సంప్రదించాలి.

ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి?

బీఎల్‌వోలు పత్రం నింపే ముందు ఓటరుకు స్పష్టమైన సూచనలు ఇవ్వాల్సి ఉటుంది. అవసరమైన పత్రాల జాబితాను ముందుగానే తెలియజేయాలి. వివరాలను ఆధార్‌, పాత ఓటరు జాబితా వంటి పత్రాలతో సరిపోల్చాలి. ఇంట్లో లేనివారికోసం మరోసారి కలిసి.. అవకాశం కల్పించాలి. ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు సమర్పించే అవకాశం ఉంటే దానిపై అవగాహన కల్పించాలి.

ఓటర్లు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎన్యుమరేషన్‌ పత్రం సమర్పించే ముందు పేరు, వయస్సు, లింగం, బంధుత్వం, చిరునామా వివరాలను ఒకసారి పూర్తిగా పరిశీలించాలి. అవసరమైన పత్రాల ప్రతులను జత చేయాలి. సందేహం ఉంటే బీఎల్‌వోను అడిగి స్పష్టత పొందిన తర్వాతే పత్రం సమర్పించాలి.

రాష్ట్రంలో 2.56కోట్ల ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఓటరు ఎన్యుమరేషన్‌ ఫత్రాల పంపిణీ, వివరాల నమోదు విషయంలో పల్లెల్లో జోరు కనబడుతోంది. ఎన్నికల అధికారులు అందించిన సమాచారం ప్రకారం... సర్‌ ప్రారంభమైన నాటి నుంచి గురువారం వరకు బీఎల్‌వోలు ఇంటింటికితిరిగి రాష్ట్రవ్యాప్తంగా 2.56 కోట్ల ఎన్యుమరేషన్‌ ఫారాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పల్లెలు, పట్టణప్రాంతాల్లో కలిపి 75.73శాతం మందికి ఎన్యుమరేషన్‌ పత్రాలను పంపిణీ చేసినట్లు వారు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు

కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది

Updated Date - Jul 03 , 2026 | 07:07 AM